ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి 16000 మంది భారతీయులను సురక్షితంగా తరలించడం ఇప్పుడు భారత్ కు తక్షణ ప్రాధాన్యతగా మారింది. అయితే ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్ మూసివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.
కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం గురువారం మూడు సూచనలు చేసింది. “అత్యంత అనిశ్చిత” పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారతీయులు సురక్షితంగా ఉండాలని తెలిపింది. పరిస్థితుల దృష్ట్యా ప్రయాణానికి దూరంగా ఉండాలని కోరింది. భారతీయుల తరలింపునకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది.
భారతీయుల తరలింపు కోసం పొలాండ్, హంగేరీ, రొమెనియా, స్లోవాకియాలను ప్రత్యామ్నాయ మార్గాలుగా అధికారులు గుర్తించారు. దేశాన్ని విడిచి వెళ్లేందుకు గాను ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు చేస్తోంది.
ఉక్రెయిన్ నుండి భారతీయుల నిష్క్రమణకు సహాయం చేయడానికి జోహనీలోని సరిహద్దు పోస్ట్‌కు హంగేరీలోని భారత రాయబార కార్యాలయం ఒక బృందాన్ని పంపింది.
పోలాండ్, స్లోవేకియా, రొమేనియా సరిహద్దు ప్రాంతాలకు మరో మూడు బృందాలు వెళ్తాయని విదేశాంగ కార్యదర్శి హర్ష్ ష్రింగ్లా మీడియా సమావేశంలో తెలిపారు. ఈ నాలుగు దేశాలకు చెందిన కొందరు భారతీయ అధికారులు కూడా సరిహద్దు దాటి వెళ్లి భారతీయులకు సహాయం చేసేందుకు ఉక్రెయిన్‌లోని ఎల్వివ్, చెర్నివ్ట్సీ వంటి ప్రదేశాలలో క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేస్తారని వెల్లడించారు.
గత నెలలో దాదాపు 20,000 మంది భారతీయ పౌరులు కైవ్‌లోని భారత రాయబార కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇటీవల 4,000 మంది ఉక్రెయిన్‌ను విడిచిపెట్టినట్లు ష్రింగ్లా చెప్పారు. భారత పౌరులందరి భద్రత, వారి తరలింపు అనేది ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశంలో ప్రధాని మోడీ చెప్పారని ఆయన అన్నారు.