భీమ్లానాయక్ సినిమాకు డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించాడు త్రివిక్రమ్. కీలకమైన క్లయిమాక్స్ పార్ట్ ను మార్చడంలో యూనిట్ బాగా సక్సెస్ అయింది. అయితే ఆ క్లైమాక్స్ ను మార్చింది ఎవరు? అది త్రివిక్రమ్ కు వచ్చిన ఆలోచననా? లేక దర్శకుడు సాగర్ చంద్ర వర్కవుట్ చేశాడా? ఇలా విడదీసి చూడడం లేదు భీమ్లా దర్శకుడు సాగర్ చంద్ర. త్రివిక్రమ్ తో కలిసి మార్పుచేర్పులు చేశానని చెబుతున్నాడు.
“త్రివిక్రమ్‌గారితో చర్చల్లో కూర్చుని మొదట చర్చించింది కోషి పాత్రను భీమ్లాకు ఎలా మార్చాలి… అన్న దగ్గర మొదలైంది. అసలు ఇది రీమేక్ అని మరిచిపోయాం. మెయిన్ కథ, కమర్షియల్ అంశాలు, పవన్–రానా పాత్రల బ్యాలెన్స్ చేయడం వంటి అంశాల మీద ఎక్కువ దృష్టిపెట్టాం. దీని రీమేక్ హక్కులు మరొకరు తీసుకోవాలి అన్నట్లు పని చేయాలి అని త్రివిక్రమ్ గారు ముందే చెప్పారు. ఆయన అన్న మాటను ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం అనుకుంటున్నా. రీమేక్‌లా కాకుండా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ లాంటి సినిమాను తెరకెక్కించాం అనుకుంటున్నాం.”
ఒరిజినల్ లో ఉన్న కొన్ని కల్ట్ సన్నివేశాల్ని తెలుగులో రీమేక్ చేయలేదు. వీటిపై కూడా స్పందించాడు సాగర్ చంద్ర. ఆ సన్నివేశాల్ని భీమ్లా కథలో పెట్టాలంటే స్టోరీ టెల్లింగ్ లో తేడా వస్తోందని, తెలుగు ప్రేక్షకులకు ఏం కావాలో.. ఏ సీన్ పండుతుందో చెక్ చేసుకుని మాత్రమే పెట్టామంటున్నాడు.
“వకీల్‌సాబ్ సినిమా సెట్‌లో కల్యాణ్‌గారిని వన్ టు వన్ కలిశా. అప్పుడు కోర్టు రూమ్ సీన్ చేస్తున్నారు. సినిమా గురించి మాట్లాడుతుండగా బాగా తీయ్.. బాధ్యతగా పని చేయ్ అని చెప్పారు. అంతే ఎనర్జీతో మేం పని చేశాం. ఆ తర్వాత జర్నీ అంతా అందిరికీ తెలిసిందే!”
Advertisements
ఇకపై స్ట్రయిట్ కమర్షియల్ సినిమాలు తీస్తానంటున్నాడు సాగర్ చంద్ర. గతంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా ఆగిపోయిందని, అది మళ్లీ పట్టాలపైకి వస్తుందా లేక మరో సినిమా చేస్తానా అనే విషయంపై ఈ దర్శకుడు ఇంకా ఆలోచించుకోలేదట.