– సాహితీ ఇంట్లో సంబరాలు
– రెట్టింపు అయిన బాధితుల బాధలు
– జైలు నుంచి రాగానే ఒక్కటైన పెట్టుబడిదారులు
– కస్టమర్స్ ని నిండా ముంచేందుకు ప్రణాళికలు
– రూ.3 వేల కోట్ల మోసం.. 30కి పైగా కేసులు
– అయినా.. పట్టించుకోని పోలీసులు
– సాక్ష్యాధారాల ధ్వంసం దిశగా అడుగులు
– పీడీ యాక్ట్ నమోదు చేయాలని బాధితుల డిమాండ్
క్రైంబ్యూరో, తొలివెలుగు:వేల కోట్ల మోసానికి పాల్పడి బెయిల్ పై బయటకొచ్చాడు సాహితీ సంస్థ ఓనర్. మరి.. బాధితులకు న్యాయం జరిగిందా? అంటే లేదు. పీడీ యాక్ట్ ప్రయోగించి నేరాలను నియంత్రించే తెలంగాణ పోలీసులు.. డబ్బులున్నవారికి ఒకలా.. లేనివాడికి మరో తీరుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెయిలబుల్ కేసులు 5 ఉన్నా 90 రోజుల జైలు జీవితాన్ని 365 రోజులకు పొడిగించేలా ప్రివెంటివ్ డిటెన్ష్ యాక్ట్ 1950ని ఉపయోగిస్తారు. అయితే.. రాజకీయ పలుకుబడి ఉన్న ఆర్థిక నేరగాళ్లకు మాత్రం ఇది వర్తింప చేయడం లేదు. 30కి పైగా కేసులు 3 వేల కోట్ల రూపాయలు మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ ఎండీ లక్ష్మీ నారాయణపై పోలీసులు ప్రేమ కురిపిస్తున్నారని.. తమకు భరోసా కల్గించేలా విచారణ జరగలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
బెయిల్ పై రాగానే రాజభోగాలు
సగటు జీవి నుంచి ప్రీలాంచ్ ఆఫర్స్ తో దోచుకున్న బూదాటి లక్ష్మీనారాయణ బెయిల్ పై బయటకొచ్చాడు. దీంతో తన ఇంటికి గ్రాండ్ గా వెళ్లి.. సంబరాలు చేసుకుంటున్నాడు. ఇన్నాళ్లూ నలుగురు ఉండే బౌన్సర్స్ 15కి పెంచుకున్నాడు. పాత డైరెక్టర్స్ అందరూ కలిసి కుటుంబసభ్యులతో డిన్నర్ చేసుకున్నారు. ఇవన్నీ గమనిస్తుంటే.. పక్కా ప్లాన్ ప్రకారమే అందరూ కలిసి దోచుకున్నారని.. అది తప్పించుకోవడానికే జైలు డ్రామాలు ఆడారని మోసపోయిన కుటుంబాలు వాపోతున్నాయి. అన్ని కేసులు కలిపి హైకోర్టు విచారిస్తుందని చెబుతున్న ప్రభుత్వం, పోలీసుల తరుఫు నుంచి వేసే కౌంటర్ పై నమ్మకం లేదని ఆరోపిస్తున్నారు బాధితులు. రాజకీయ పలుకుబడి ఉన్నవారికే డబ్బులు తిరిగి ఇప్పించేలా ప్లాన్స్ వేసుకుంటున్నారని వినికిడి. దీంతో బాధితుల్లో ఆందోళన ఎక్కువైంది.
సాక్ష్యాధారాలు ధ్వంసం
బెయిల్ పై బయటకు వస్తే సెటిల్మెంట్ చేస్తారని చాలామంది భావించారు. కానీ, ఆ దిశగా ఆలోచన లేనట్లు కనిపిస్తోంది. నిండా మునిగాం ఎవరికి ఎలా చేయాలో తెలుసు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు చేసిన వారిపై ఒత్తిళ్లు పెంచి సరైన సాక్ష్యాధారాలు ఇవ్వకుండా అడ్డుకునేలా లీగల్ టీంని తయారు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇచ్చిన డబ్బులో 50శాతం చెల్లించి క్లోజ్ చేసేలా టార్గెట్స్ పెట్టుకుంటున్నారట. ఈ విషయాలన్నీ కోర్టు దృష్టికి వెళతాయా.. లేదా గతంలో మాదిరిగా ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు.. ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తారా? అనేది వారం రోజుల్లో తేలిపోతుంది.
నిరసన బాటలో బాధితులు
3 వేల మంది బాధితుల్లో 1500 మంది రోజూ నరకం అనుభవిస్తున్నారు. వీరంతా కూతురు పెళ్లి కోసమో, కుమారుడికి ఇళ్లు ఇప్పించాలనో నెలనెలా దాచుకున్న సొమ్ముని సాహితీకి ఇచ్చారు. దీంతో న్యాయం జరిగే వరకు రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. పోలీసులు సహకరించాలని వేడుకుంటున్నారు.