– సాహితీ స్కాం డబ్బులు ఎక్కడ?
– సీసీఎస్ ముందు బాధితుల అందోళన
– శ్రీనిధి శ్రీహరితో కలిసి దేశం దాటించారా?
– ఈడీ అధికారుల చూపు వారిపైనే..
– సాహితీతో లాభపడ్డ వారి లిస్ట్..
– తొలివెలుగు ఎక్స్ క్లూజివ్
– క్రైంబ్యూరో చేతిలో పక్కా ఆధారాలు
– డ్రామా కంపెనీలా డైరెక్టర్స్ యాక్టింగ్!
క్రైంబ్యూరో, తొలివెలుగు:మాయమాటలు చెప్పి వేల కోట్లు వసూలు చేసిన సొమ్ము ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు బాధితులు. సెటిల్మెంట్స్ అంటూ ఆశలు పెట్టించిన నాయకులకు భారీగానే లబ్ది చేకూర్చారు లక్ష్మీ నారాయణ. ఈడీ కేసుతో అలర్ట్ అయిన తెలంగాణ ఇంటెలిజెన్స్ కేసీఆర్ కి సమాచారం అందించింది. మరో లిక్కర్ స్కాంలా కాకుండా ముందే సర్దుకునేలా అరెస్ట్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. తొలివెలుగు క్రైంబ్యూరో.. లీడర్ల లీలలు ఏంటని ఆరా తీసింది. ఆ సొమ్మంతా ఎక్కడకి పోయిందని లోతుల్లోకి వెళ్లింది. మళ్లీ అన్నివేళ్లు అదే ఫినిక్స్ కంపెనీ వైపు చూపిస్తున్నాయి.
లిక్కరే కాదు.. సాహితీని వదలలేదు!
లిక్కర్ స్కాంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మహిళా ఎమ్మెల్సీకి 2018 నుంచి సాహితీ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి రూ.7 కోట్లు ముట్టినట్లు బూదంటి వద్ద ఆధారాలు ఉన్నాయని తెలుస్తోంది. కొన్నిసార్లు డైరెక్టర్స్ పూర్ణచందర్, లక్ష్మి నారాయణ గొడవలు పడినప్పుడు ఇద్దరి వద్ద నుంచి డబ్బులు లాగేశారట. సైబరాబాద్ డీసీపీ మధ్యవర్తిత్వం కూడా వహించారని టాక్. అదే సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది పూర్ణ చందర్ చేసిన లాస్ పై కేసును సీరియస్ గా తీసుకున్నారు. కానీ, మళ్లీ అందరూ ఓకే అయిపోయారు. ఆ న్యాయవాదికి స్పీడ్ బ్రేకులు వేశారు. వీరి తీసుకున్న నిర్ణయంతో చివరకు బాధితులు పిచ్చోళ్లు అయ్యారు. రూ.100 కోట్లు వస్తున్నాయని నకిలీ ఎన్ఓయూలు రాయించుకొని ఏడాది పాటు గడిపేశారు. బయటకు చూస్తే కొట్లాడుకుంటారు. లోపల అంతా మేడం సెటిల్మెంట్ చేసి వాటాలు తీసుకున్నారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై ఈడీ ఫోకస్ చేసినట్లు సమాచారం.
ప్రగతి భవన్ అంటూ పల్లాను వాడేశారు!
నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఎమ్మెల్సీ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డికి సాహితీ భారీగానే లబ్ది చేకూర్చిందని సమాచారం. జూబ్లీహిల్స్ లో కమర్షియల్ స్పేస్ స్క్వేర్ ఫీట్ 15 వేలు అమ్ముతుండగా కేవలం 3 వేల రూపాయలకే ఇచ్చేశారు. అనుమతుల కోసం ఆ ఎమ్మెల్సీ ఎత్తుపల్లాలు చూసుకున్నారట. ప్రగతి భవన్ లో తన వాళ్లు ఉన్నారని చెప్పి మరీ లిటిగేషన్ ల్యాండ్ ఓనర్స్ ని బెదిరించేవారట లక్ష్మీ నారాయణ.
ఓ సెటిల్మెంట్ లో వెలిగిన కార్తీక దీపం!
గచ్చిబౌలిలో ఏఐజీ హాస్పిటల్ ముందు ఉన్న మూడెకరాల భూమిని బంగారు బాతులా తయారు చేశారు. నగర మహిళా మంత్రి పుత్రరత్నం ఈ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్స్ లో భారీగానే లబ్ది పొందారట. ఆ భూమి మొత్తానికి రూ.17 కోట్లకు కొనుగోలు చేసి గుడిసెలు ఖాళీ చేయించి పొజిషన్ ఇప్పించి ఎకరం రూ.27 కోట్లకు సాహితీకి ఇచ్చేశారు. సాహితీ బోర్డులు పెట్టి రూ.30 కోట్ల ప్రీలాంచ్ పేరుతో మూట కట్టేసుకుంది. ఆ తర్వాత శ్రీనిధి, కేశినేని భూమి మాదని బాధితులను లోనికి రానివ్వలేదు.
మహేందర్ రెడ్డి, గాంధీ, మాగంటి, వేణుగోపాల్ చారితో దొస్తాన్!
మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో చాలానే క్లోజ్ గా ఉన్నారు. రెండు ప్రాజెక్ట్స్ లో వాటాలు మాట్లాడుకున్నారు. కానీ, పట్టాలు ఎక్కలేదు. చిన్న చిన్న సెటిల్మెంట్స్ లో రూ.2 కోట్ల వరకు ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కి మధురానగర్ ల్యాండ్ ఇష్యూలో పోలీసులకు చెప్పి సహకరించినందుకు రూ.50 లక్షలు ఇచ్చినట్లు ఆరోపణ. ఎమ్మెల్యే గాంధీ రియల్ ఎస్టేట్ లో కాలు పెట్టారు. ప్రగతి నగర్ అంబీర్ చెరువులో కట్టడాల అనుమతులు ఇప్పించి.. పక్కనే ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారు. వీరి వ్యవహారం చూసి శిల్పావారు ప్రాజెక్ట్ ఇవ్వలేదు. ఇక్కడ ఆ ఎమ్మెల్యేకు లక్ష స్క్వేర్ ఫీట్స్ ఒప్పందం కుదిరిందని టాక్. కానీ, బెడిసి కొట్టింది. అయ్యప్ప సొసైటీలో, కాకతీయ హిల్స్ సైట్ లో లాభపడ్డా.. ప్రభుత్వ పెద్దల వద్ద ఎక్కువ బద్నాం అయ్యారని ఆయన అనుచరులే అంటున్నారు.
శ్రీనిధి శ్రీహరి, ఆంటోనీ రెడ్డి వద్ద డబ్బులు?
ఫినిక్స్ సిస్టర్ కంపెనీ అయిన శ్రీనిధి శ్రీహరి.. లక్ష్మీ నారాయణతో కలిసి బిజినెస్ చేశారు. అమీన్ పూర్ ల్యాండ్ ఇప్పించింది ఈ కంపెనీయే. గచ్చిబౌలిలో సాహితీ ఇచ్చిన విల్లాలలోనే శ్రీహరి ఉంటున్నారు. దీనికి తోడుగా మరో వ్యక్తితో కలిసి డబ్బులు విదేశాలకు దాటించారని ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తెలుసుకున్నట్లు సమాచారం. ఫినిక్స్ కంపెనీని అఫీషియల్ గా మోసం చేయాలంటే కష్టం. విదేశీయులు పెట్టుబడిదారులు కానీ, ఇక్కడ ఉన్నవారి అతి తెలివితేటలతో ఆ కంపెనీకి చెడ్డపేరు తీసుకోచ్చారు. అమీన్ పూర్ లో శ్రీనివాస్ వర్మ ఉదంతం ఒక్కటి చాలు ఫినిక్స్ ల్యాండ్ పిచ్చి పీక్స్ చేరిందనడానికి. మరో డైరెక్టర్ ఆంటోని రెడ్డి నగదు తీసుకొని బ్యాంకు ద్వారా బదిలీలు చేశారని సమాచారం. సాహితీలో పెట్టుబడుల్లో బంధువులను ఇన్వాల్మెంట్ చేసి ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నారు. అయితే.. బంధువుల కంటే తాను మాత్రం ఎక్కువ లాభపడ్డట్లు తెలుస్తోంది. సెటిల్మెంట్స్ లో కీలకంగా ఉండే ఆంటోనీ రెడ్డిని సీసీఎస్ పోలీసులు వారిదైన శైలిలో విచారిస్తే అన్నీ బయటపడే అవకాశాలు ఉన్నాయి.
అన్ని పార్టీలకూ ముడుపులు!
తాను చేసే మోసాలను కప్పిపుచ్చుకునేందుకు అందరికీ అవినీతి మరకలు అంటించారు లక్ష్మీ నారాయణ. వెంకటేశ్వరుని భక్తుడినంటూ.. భక్తి ముసుగులో నోట్ల కట్టలు పారించాడు. వైజాగ్ స్వామికి రూ.10 కోట్లు ఇచ్చి, హైదరాబాద్ లో ప్లాట్స్ చూపించి.. టీటీడీ బోర్డ్ మెంబర్ అయ్యారని ఆరోపణ. వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ బడా నేతలు అంతా ఎంతో కొంత పార్టీ ఫండ్ గానో.. ఎప్పుడూ తీర్చలేని అప్పుగానో తీసుకున్నారని సమాచారం. కొంతమంది లీడర్స్ కి గాల్లో మేడలు కట్టి ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చారు. ఇప్పటికీ తన వద్ద భారీగా నగదు ఉందని నమ్మించి.. బాధితుల గొంతు కోసే పనిలోనే ఉన్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు అరెస్ట్ అవుతారో దర్యాప్తులో బాధితులకు న్యాయం చేసేలా ఉంటుందో లేదో వేచి చూడాలి. సీసీఎస్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో వెనకడుగు వేసినా.. ఈడీ గురి మాత్రం పక్కా ఆధారాలతో రెడీ చేసుకుని పెట్టుకుందని సమాచారం.