– ప్రతీ ప్రాజెక్ట్ లో కామన్ గా ప్రీలాంచ్ మోసం
– ఐదేళ్లు అయినా సొంతింటి ఆశ నెరవేర్చని వైనం
– చనిపోయిన వారి పేర్లతో అగ్రిమెంట్లు
– కాకతీయ హిల్స్ లో సాహితీ కహానీలు
– వివాదాస్పద భూముల్లోనూ రెరా పర్మిషన్లు
– అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు
– లక్ష్మి నారాయణది అంతా దొడ్డిదారే!
– అయ్యప్ప సోసైటీలోనూ అక్రమ దందా!
– సాహితీ స్కాం-నారాయణ లీలలు పార్ట్ 2
క్రైంబ్యూరో, తొలివెలుగు:సాహితీ కన్ స్ట్రక్షన్.. రియల్ వ్యాపారం నుంచి సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉంది. ఎందుకంటే వసూలు చేసిన మొత్తం అంత మొత్తంలో ఉంది మరి. తన వద్ద ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకుంటూ.. తెగబడి అక్రమాలకు పాల్పడింది. చట్టానికి వ్యతిరేకంగా వెళ్లడంతో న్యాయం గెలిచి.. పెట్టిన పెట్టుబడి కూడా ఆగిపోయింది. దొంగ పత్రాలతో లోన్స్ తీసుకున్నా.. నిర్మాణాలు పూర్తికాకపోవడంతో ఎమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు భూ కబ్జాదారుడు బీ లక్ష్మి నారాయణ.
కాకతీయ హిల్స్ కబ్జా కహానీ
సాహితీ కబ్జా కథలు.. త్రివిక్రమ్ డైలాగ్స్ మాదిరిగా ఏదో గోడ కడుతున్నట్లు.. గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లు.. జాగ్రత్తగా, పద్దతిగా ఉంటాయి. అంతా లీగల్ గా చేస్తున్నట్లు వీళ్లు ఇచ్చే కలరింగ్ మామూలుగా ఉండదు. కానీ.. తొలివెలుగు క్రైంబ్యూరో గుట్టంతా పసిగట్టేసింది. కార్తికేయ పనోరమ పేరుతో 2015లో ఓ నిర్మాణం ప్రారంభించారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో తప్పుడు అనుమతులు రద్దయ్యాయి. నిర్మాణం ఆగిపోయింది. చివరికి సబ్ రిజిస్ట్రర్ తో సహా అందరూ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. గుట్టల బేగంపేట్ లోని సర్వే నెంబర్ 22లో 2 ఎకరాల ఒక గుంట ఉంటుంది. 1972లో ఓరుగంటి చిన్న చిత్తయ్య కొనుగోలు చేశారు. ఐదుగురు కుమారులు 1992లో జగపతిరావు, రవిరావుకి జీపీఏ ఇచ్చేశారు. దీంతో వారు 5,800 గజాల భూమిని 14 ప్లాట్స్ గా.. 3,900 గజాల భూమిని రోడ్లు, పార్కులుగా విభజించారు. అయితే.. 2015లో 14 మంది ప్లాట్ ఓనర్స్ వద్ద నుంచి డెవలప్మెంట్ తీసుకున్న సాహితీ కన్ స్ట్రక్షన్ రోడ్డులను, పార్క్ ప్లేస్ ని కలుపుకుని నిర్మాణం మొత్తం 9,800 గజాల్లో చేపట్టింది.
పక్కనే ఉన్న భూమిని సైతం కొట్టేశారు!
సర్వే నెంబర్ 27లో ఉన్న 26 గుంటల భూమిని 22లోదే అని చెప్పుకుని ఫేక్ డాక్యుమెంట్లతో, ఫోర్జరీ చేసి కొనుగోలు చేశారు. అయితే, 22 సర్వే నెంబర్ లో కేవలం 2 ఎకరాలు ఉంటే రికార్డుల్లో మాత్రం వీరి పేరుపై 26 గుంటల భూమి ఎక్కువ ఉంది. దీనిపై కుమ్మరి రాజయ్య కుటుంబం కోర్టు మెట్లు ఎక్కింది. కూకట్ పల్లి కోర్టు 2017లో స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. దీన్నే జీహెచ్ఎంసీలో ఫిర్యాదు చేశారు. కానీ, 2018లో తాము రాజీ కుదుర్చుకుంటామని జీహెచ్ఎంసీని నమ్మించి అనుమతులు తీసుకుంది. వీటితో రెరాలో అనుమతులు వచ్చాయి. గులాబీ నోట్లు ఇస్తే.. ఏదైనా చేసేందుకు రెరా ఉందని చెప్పడానికి ఇదో నిదర్శనం. అక్రమ అనుమతులపై మళ్లీ హైకోర్టులో రిట్ దాఖలయింది. 13,056 ఆఫ్ 2020లో జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆ అనుమతులు రద్దు చేస్తూ నోటీసులు వచ్చాయి. అయినా స్థానిక ఎమ్మెల్యేతో తనదైన గాంధీగిరి శైలిలో నిర్మాణం జరిపించారు. దీనిపై కోర్టు ధిక్కరణగా కేసు వేయడంతో హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు పనులు పూర్తిగా ఆపివేశారు.
చనిపోయిన వారి పేరు మీద అగ్రిమెంట్లు!
లే అవుట్ లోని రోడ్లు, పార్క్ ప్లేస్ కబ్జా చేసి నిర్మిస్తుండటంతో లీగల్ గా సమస్యలు వచ్చాయి. పట్టాదారుడి దగ్గర నుంచి కూడా డెవలప్మెంట్ కి తీసుకున్నట్లు అగ్రిమెంట్లు సృష్టించారు. ఓరుగంటి నర్సింహా 2003 అగస్ట్ 31న చనిపోయారు. ఓరుగంటి పోషయ్య 2015, రాములు 2017లో మరణించారు. వారంతా బతికున్నట్లుగా 2019లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు సాహితీ అధినేత లక్ష్మినారాయణ. దీన్ని కూకట్ పల్లి సబ్ రిజిస్ట్రర్ వద్ద బతికి ఉన్నారని ఫేక్ డాక్యుమెంట్లతో, ఫోర్జరీ సంతకాలతో ధ్రువీకరణ చేసుకున్నారు. ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు కోర్టుకు తెలపగా.. మాదాపూర్ పోలీసులు 2021లో కేసు నమోదు చేశారు. నిందితులుగా సబ్ రిజిస్ట్రర్ సంధ్యారాణి, రామ్మోహన్ రెడ్డి, లక్ష్మినారాయణ, సైట్ ఇంచార్జీ మహేష్ లపై ఎఫ్ఐఆర్ నమోదయింది. కానీ, ఇప్పటి వరకు చార్జీషీట్ దాఖలు చేయలేదు. ఇటీవల హైకోర్టు మొట్టికాయలు వేయడంతో నెల రోజుల్లో దాఖలు చేస్తామని తెలిపారు. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నాయకుల ఒత్తిళ్లతో క్రిమినల్ కేసు పెండింగ్ లోనే ఉంది.
దెబ్బ మీద దెబ్బ?
వివాదాస్పద ప్రైవేట్ భూముల్లో రూపాయి నష్టం వచ్చినా.. రాజీ కుదుర్చుకుని వెళ్లాలి. కానీ, అధికార పార్టీ నేతలు ఉన్నారనే అహంకారం, గులాబీ నోట్లతో అధికారులు ఏ అనుమతులైనా ఇచ్చేస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో మొదటికే మోసం వచ్చింది. సర్వే నెంబర్ 27లో కబ్జా చేసిన భూమిలో అనుమతులు రద్దు కాగా.. అప్పుడు ప్లాట్స్ లాగా అమ్మిన ఐదుగురు అన్నదమ్ముల్లో ఇప్పుడు మరో ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమకూ వాటా వస్తుందని హైకోర్టులో కేసు వేశారు. దీంతో మరో 4వేల గజాల నిర్మాణంలో స్టే ఆర్డర్ వచ్చింది. 16 వేల గజాల నిర్మాణాల్లో 7వేల గజాల భూమిపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ప్రాజెక్ట్ మొత్తానికే దెబ్బ పడింది. దొంగ పత్రాలతో చేసుకున్న అగ్రిమెంట్లతో కేసులు నమోదయ్యాయి.
అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం
గురుకుల్ ట్రస్ట్ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు జరపొద్దని సుప్రీం స్టే ఆర్డర్ ఉంది. కానీ, చిన్నపాటి నిర్మాణాలు రాజకీయ అండదండలతో కొనసాగుతున్నాయి. సాహితీ మాత్రం ఏకంగా ఎకరం భూమిలో నిర్మాణం చేపట్టింది. 5 వేలకు స్క్వేర్ ఫీట్ అంటూ అమ్మకానికి పెట్టింది. ఖానామెట్ సర్వే నెంబర్ 11/32 చందానాయక్ తండా వెనుక భాగంలో నిర్మాణం చేపడుతున్నారు. అక్రమ నిర్మాణం ఒక్కటి జరిగినా చెప్పాలన్న కేటీఆర్ కి.. 6 అంతస్తుల్లో 70 అపార్ట్ మెంట్లు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించడం కనిపించడం లేదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరగదు కాబట్టి.. తక్కువ ధరకు వస్తుందని అమ్మేశారు. బీఆర్ఎస్ కట్టుకోవాలని కస్టమర్స్ కి సూచిస్తున్నారు. ఒక వేళ నాలుగేళ్ల క్రితం ఇదే అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేవని లెటెస్ట్ టెక్నాలజీతో నిర్మించిన భవంతిని కూల్చివేశారు. అదే ఇక్కడ జరిగితే బాధ్యులు ఎవరు? ఈ మొద్దునిద్ర వ్యవహారానికి భవిష్యత్తులో బలయ్యేది ఎంతమందని అందరి వేళ్లు సాహితీ అక్రమ నిర్మాణం వైపే చూపిస్తున్నాయి.
చనిపోయిన వ్యక్తుల భూములు కబ్జా చేయడంలో మాస్టర్ మైండ్! వెంగళరావు నగర్ లో ఏం జరిగిందో సాహితీ స్కాం- నారాయణ లీలలు పార్ట్ 3లో చూద్దాం.