– సాహితీ కన్ స్ట్రక్షన్ భారీ మోసం
– వెయ్యి కోట్ల స్కాంకి తెర
– కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ టీటీడీ బోర్డ్ మెంబర్ బీఎల్ నారాయణ
– జూబ్లీహిల్స్ ఆఫీస్ కు క్యూ కట్టిన బాధితులు
– విషయం బయటకు రాకుండా మామూళ్ల ఎర
– తొలివెలుగు రిపోర్టర్ కి రూ.10 వేలు ఇచ్చే ప్రయత్నం
– సామాన్యుడి సొంతింటి కలతో ఆటలు
– తొలివెలుగు క్రైంబ్యూరో వరస కథనాలు
క్రైంబ్యూరో, తొలివెలుగు:భాగ్యనగరంలో కొన్ని కన్ స్ట్రక్షన్ కంపెనీల తీరు ఎలా ఉంటుందో తొలివెలుగు ఎన్నో కథనాలు ఇచ్చింది. తెర వెనుక జరిగే రహస్య దందాను తెరపైకి తీసుకొచ్చింది. పునాదులు కూడా తీయని నిర్మాణాలను చూపించి కస్టమర్లను ఎలా బోల్తా కొడతారో వివరించింది. భవిష్యత్ పై అత్యాశను కల్పించి సామాన్యుడి కష్టార్జితాన్ని గద్దల్లా ఎలా ఎగరేసుకుపోతారా? కళ్లకు కట్టింది. కానీ.. ప్రీ లాంచ్ పేరుతో కొత్త కొత్త ఆఫర్లతో దోపిడీ కొనసాగుతూనే ఉంది. తాజాగా సాహితీ కన్ స్ట్రక్షన్ కంపెనీ చేసిన భారీ మోసం వెలుగుచూసింది.
కోట్లలో డబ్బు వసూలు.. మూడేళ్లయినా ఇటుక పెట్టలేదు!
నాయకులకు కోట్లలో పార్టీ ఫండ్.. అధికారులకు అపార్ట్ మెంట్స్.. అడిగిన వారికి లక్షల్లో మాముళ్లు.. గత నాలుగేళ్లుగా సాహితీ కన్ స్ట్రక్షన్ చేస్తున్న మెనేజ్మెంట్ ఇదే. దీని ఓనర్, టీటీడీ బోర్డ్ మెంబర్ బీఎల్ నారాయణకు ప్రీ లాంచ్ పేరుతో వేల కోట్ల రూపాయలు వసూలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఒక్క అమీన్ పూర్ ప్రాజెక్ట్ లోనే 3 వేల మంది బాధితులు ఉన్నారంటే అర్ధం చేసుకోండి ఏ విధంగా దందా నడిపిస్తున్నారో. శర్వాని ఎలైట్స్ పేరుతో 4 వేల ఫ్లాట్స్ నిర్మించి ఇస్తామని నమ్మించి ఒక్కొక్కరి దగ్గర రూ.15 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు వసూలు చేశారు. మూడేళ్లు దాటినా ఇటుక పెట్టలేదు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆఫీస్ కు వెళ్లి నిలదీశారు. తర్వాత సీసీఎస్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.
తొలివెలుగులో రాకుండా ఎర!
ప్రగతినగర్, బొంగుళూర్, కాకతీయ హిల్స్, అయ్యప్ప సొసైటీ, కొంపల్లి, శామీర్ పేట్, తెల్లాపూర్, పత్రికా నగర్, శంషీగూడలో ఇలా ప్రతి నిర్మాణంలో ఎదో ఒక లిటిగేషన్, ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టి భారీగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నేతల సమక్షంలో 2 ప్రాజెక్ట్స్ సెటిల్మెంట్ చేసుకున్నారు. డబ్బులన్నింటినీ విదేశాల్లో పెట్టుకుని ఇప్పుడు తనకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. అవసరమైతే దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వం స్పందించకపోతే 10 వేల కుటుంబాలు రోడ్డు పాలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Advertisements
సాహితీ కన్ స్ట్రక్షన్ ఎలా మోసాలకు పాల్పడిందో పూసగుచ్చినట్లు వెలుగులోకి తీసుకొచ్చేందుకు తొలివెలుగు క్రైంబ్యూరో సిద్ధమైంది. ఇకపై వరుస కథనాలు ఉంటాయి.