విరాటపర్వం సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు రానా-సాయిపల్లవి. పేరుకు వీళ్లు హీరోహీరోయిన్లు అయినప్పటికీ సినిమా కథ మొత్తం సాయిపల్లవి చుట్టూ తిరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇదొక ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ అనుకోవచ్చు. ఇలాంటి సినిమాలో నటించడానికి ఒప్పుకున్న రానాను ప్రత్యేకంగా అభినందించింది సాయిపల్లవి. ఎంతో పెద్ద మనసు ఉంటే తప్ప ఇలాంటి పనులు ఎవరూ చేయలేరని అంటోంది.
“పెద్ద మనసు ఉన్న వారు వాళ్ళే అంతా చేయాలని అనుకోరు. వెనక ఉండి సహాయం చేస్తారు. రానాది కూడా అలాంటి గొప్ప మనసు. అన్నీ తానే చేయాలని అనుకోకుండా సినిమా సైన్ చేసినప్పటి నుండి ఇప్పటివరకూ మాకు సపోర్ట్ గా నిలబడ్డారు. రానాతో పని చేయడం చాలా గొప్పగా ఉంది.”
ఇలా రానా గొప్పదనాన్ని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. కేవలం ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోవడమే కాకుండా, తనపట్ల రానా చాలా కేర్ తీసుకున్నాడని చెప్పుకొచ్చింది. కర్నూల్ ఫంక్షన్ లో గొడుగు పట్టడం నుంచి, సెట్స్ లో బౌన్సర్లను ఏర్పాటు చేయడం వరకు చాలా సందర్భాల్లో రానా తనకు సహాయం చేశాడని చెప్పింది సాయిపల్లవి.
ఇక సినిమాలో కూడా రానా చాలా చోట్ల తగ్గాడని, డైలాగ్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా తనకు ప్రాధాన్యం ఇచ్చాడని అంటోంది. ఇవన్నీ అతడి గొప్ప మనసుకు నిదర్శనాలని అంటోంది సాయిపల్లవి. ఈనెల 17న థియేటర్లలోకి వస్తోంది విరాటపర్వం.