అద్భుతమైన నటనతో ప్రేక్షకలను ఆకట్టుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చింది. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ క్రేజ్ ను సంపాధించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకుంది. తాజాగా.. ‘విరాట పర్వం’ ప్రమోషన్స్ లో భాగంగా గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో సాయి పల్లవి పేరు మోత మ్రోగిపోతుంది.
ఈ నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి, గో రక్షకుల గురించి ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. సంచలనంగా మారాయి. దీంతో చాలామంది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తనపై పోలీసులకు పిర్యాదు కూడా చేశారు. ఇక తాజాగా ఈ వ్యాఖ్యలపై సాయి పల్లవి స్పందించింది.
‘విరాటపర్వం’ ప్రమోషన్స్ లో భాగంగా నేడు విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇంటర్వ్యూ లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.. దానిపై మీ స్పందన ఏంటి అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పల్లవి మాట్లాడింది.
” నా మీద ఉన్న ప్రేమతో, నన్ను కాపాడడానికి మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారని అర్థమైంది. అభిమానులు కూడా నన్ను సేవ్ చేయడానికి ట్రోల్స్ కు కామెంట్స్ కూడా ఇస్తున్నారు. అయితే.. ఇది ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు. సినిమా ప్రమోషన్స్ లో ఉన్నాం. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా.. అదేదో సినిమా ప్రమోషన్ కోసం చేశానని, చెప్పానని అనుకుంటారు. దానికి ఒక సమయం ఉంటుంది.. అది నేను చెప్తాను” అని సున్నితంగా చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.