గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు సాయి పల్లవి. విరాటపర్వం చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా తను కశ్మీర్ పండిట్ల, గోహత్యల పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై భజరంగ్‌దళ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
తాజాగా తన పై జరుగుతున్న ప్రచారం గురించి సాయి పల్లవి ఓ వివరణ ఇచ్చారు. తాజాగా ఆమె ఓ వీడియో ఫైల్ ను షేర్ చేశారు. తను చెప్పిన మాటలను పూర్తిగా తీసుకోకుండా కేవలం కొన్ని మాటలను మాత్రమే తీసుకుని వాటిని వక్రీకరించి తనపై ఇలాంటి దుష్ప్రచారం చేశారంటూ తెలిపారు.
తన మాటల వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించమని కోరారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నాకు సపోర్ట్‌గా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. * గత కొన్ని రోజులుగా నా పై వస్తున్న విమర్శలు…. నా వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తూ నా పై జరుగుతున్న ప్రచారానికి సమాధానం ఇచ్చేందుకే నేను మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను ఏమి మాట్లాడాలన్న ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే నా మాటల వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు.ఒక వేళ నా మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి. ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్వ్యూ లో వారు మీరు లెఫ్ట్ వింగ్‌కు మద్ధతిస్తారా? రైట్ వింగ్‌కు మద్ధతిస్తారా?
అని అడిగారు. దానికి నేను వారికి వీరికి అని కాదు ముందు మనం మంచి మనుషులుగా జీవించాలనే ఉద్దేశంతో సమాధానమిచ్చాను. కానీ నా మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకొని ఏవేవో ప్రచారం చేశారు. నా దృష్టిలో హింస అనేది తప్పు. ఒక డాక్టర్ గా నాకు ప్రాణం విలువ తెలుసు. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ నాకు సపోర్ట్ గా మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు* అంటూ సాయి పల్లవి చెప్పారు.