“భానుమతి.. నేను హైబ్రీడ్ పిల్లని” అంటూ తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఫిదా భామ సాయిపల్లవి వరంగల్ జిల్లా పరకాలలో అలా మెరిసి, ఇలా మాయమై పోయిందట. అసలింతకీ ఏంటీ విషయం, ఇదేమైనా ఫిక్షన్ స్టోరీయా అంటే అస్సలు కాదు. నిజంగానే సాయిపల్లవే తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా పరకాల గ్రామంలో కాసేపు అలా కనిపడి, అంతలోనే మాయం అయిపోయింది.
వివరాల్లోకెళ్తే భల్లాలదేవుడు రాణా దగ్గుబాటి, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా విరాట పర్వం అనే ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూట్ వరంగల్ జిల్లాలో జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఒక కారులో సాయిపల్లవి పరకాల బస్టాండుకు చేరుకుని, కారు దిగి బస్టాండ్ ప్లాట్‌ఫామ్‌పై కాసేపు ఎదురుచూస్తూ అందరితో పాటు ఒక సాధారణ ప్రయాణీకురాలిలానే కూర్చుంది. చుట్టుపక్కల వారు తనను గమనించి, గుర్తించేలోపే అక్కడి నుంచి నడచి వెళ్ళి తన కారెక్కి వెళ్ళిపోయిందిట.
తను ఫిదా హీరోయిన్ సాయిపల్లవి అని తోటి ప్రయాణీకులు గమనించేలోపే ఇదంతా జరిగిపోయింది. నిజానికి విరాటపర్వం సినిమాలో భాగంగా సాయిపల్లవి బస్టాండులో బస్సు కోసం ఎదురుచూసే సన్నివేశం చిత్రీకరణ అలా జరిగిపోయిందిట. అక్కడ షూటింగ్ జరుగుతున్న విషయం ఎవరికీ తెలీకుండా ఉండేందుకని, దగ్గరలో ఉన్న ఒక లాడ్జిలో కెమెరా ఏర్పాటుచేసి మరీ రహస్యంగా ఈ సీన్ అతి సహజసిద్ధంగా వచ్చేలా చిత్రీకరించారట.
రాణా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం “విరాటపర్వం” షూటింగ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం మండల కేంద్రంలో ఉన్న గణపేశ్వరాలయం పరిసరాల్లో నిన్నకొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. హీరో హీరోయిన్లపై కొన్ని సన్నివేశాలతో పాటు, ఓ పాట చిత్రీకరణ ఇక్కడ జరుగుతున్నట్టు సమాచారం. చిత్ర యూనిట్ అందించిన వివరాల ప్రకారం మరో కొన్నిరోజులు విరాటపర్వం షూటింగ్ ఇదే పరిసరాల్లో జరగబోతోందట.