మలయాళంలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా వచ్చిన చిన్న చిత్రం “ప్రేమం” గుర్తుందా? ఆ సినిమా కేవలం మలయాళ ప్రేక్షకులనే కాకుండా మొత్తం సినీ ప్రపంచాన్నే తనవైపుకు లాగేసుకుంది. ఆ సినిమాతో తెరంగేట్రం చేసిన మేడం మలర్… ఐ మీన్ సాయి పల్లవి ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయింది. దక్షిణాది సినీ ఇండస్ట్రీ మొత్తం ఆమె నటనకు దాసోహాం అయ్యారు. తెలుగు, తమిళం, మలయాళం అండ్ కన్నడం… నాలుగు ఇండస్ట్రీలూ సాయిపల్లవి డేట్స్ కోసం క్యూలు కట్టేశాయి. మన తెలుగులో తను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేసిన ఫిదా చిత్రంతో డెబ్యూ చేసి ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. ఆ తర్వాత తనకు కుప్పలు తెప్పలుగా అవకాశాలు వచ్చినా.. చాలా సెలెక్టివ్ సినిమాలు మాత్రమే ఒప్పుకుంటూ తన కెరియర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది సాయిపల్లవి. ఈ క్రమంలోనే తనకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ నుంచి పిలుపొచ్చింది. అది కూడా ఒక్కసారి కాదట, ఏకంగా మూడు సినిమా ఆఫర్స్ ఇచ్చారు. బ్యానర్ వాల్యూ కంటే సినిమా కథకు, తన పాత్రకు మాత్రమే విలువిచ్చే ఈ అమ్మడు, ఆ మూడు ఆఫర్లను తిరస్కరించిందని మేటర్. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా పరశురాం దర్శకత్వంలో వచ్చి భారీ సక్సెస్ సొంతం చేసుకున్న గీతా గోవిందం సినిమాలో గీత పాత్రకు మొదటి ఛాయిస్ సాయి పల్లవే. కానీ మామూలు స్కిన్ షోకే ఒప్పుకోని సాయి పల్లవి, అందులో ఏకంగా లిప్ లాక్ సీన్స్ ఉండడంతో నో చెప్పినట్టు సమాచారం.
ఆ తర్వాత స్టైలిష్ స్టార్ హీరోగా మాటల మాంత్రికుడూ త్రివిక్రం దర్శకత్వంలో సెట్స్‌పై ఉన్న “అల వైకుంఠపురం” సినిమాలో కూడా హీరోయిన్‌గా ముందుగా సాయిపల్లవినే అనుకున్నారు. కానీ తను ఆ ప్రాజెక్ట్ కూడా ఒప్పుకోలేదు. అందరూ తన డేట్స్ అడ్జస్ట్ కాక చెయ్యలేకపోయింది అని చెబుతున్నా… నిజమైన కారణం మాత్రం ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు కాబట్టి నచ్చక సాయిపల్లవి రిజెక్ట్ చేసిందట. ఇక లేటెస్ట్‌గా అక్కినేని చిన్నబాబు అఖిల్ హీరోగా ఇప్పుడూ షూటింగ్ జరుపుకుంటున్న బొమ్మరిల్లు భాస్కర్ సినిమా కోసం కూడా సాయిపల్లవినే హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నారు. ఆ సినిమాకు కూడా సాయిపల్లవి తన పాత్ర సరిగా లేదని నో చెప్పేసిందట.
అలా అని సాయి పల్లవికి పొగరు అనుకోవడం కూడా సబబు కాదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ శేఖర్ కమ్ముల తాజాగా పట్టాలెక్కిస్తున్న సినిమాలో నాగ చైతన్య సరసన హీరోయిన్‌గా నటించడానికి సాయి పల్లవి సై అనడమే. పై మూడు సినిమాలు, బేనర్లతో పోలిస్తే ఇది ఒక విధంగా చిన్న చిత్రమే. అయినా సినిమా కథ, పాత్ర తీరుతెన్నులు, హీరోయిన్ కేరెక్టర్ ప్రాముఖ్యత నచ్చితే చిన్న సినిమాకైనా తను సిద్ధం అని చెప్పకనే చెప్పేసింది ఈ హైబ్రీడ్ పిల్ల భానుమతి.