పవన్ కల్యాణ్ మరో రీమేక్ పై కన్నేశాడనే విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది తొలివెలుగు. ఇప్పుడా ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మీకోసం.
తమిళ్ లో వచ్చిన వినోదాయ శితం సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించాడు. ఈ సినిమాకు సంబందించి కథలో మార్పుచేర్పులు, స్క్రీన్ ప్లే బాధ్యతల్ని త్రివిక్రమ్ కు అప్పగించారు. ఈ ప్రాజెక్టులో పవన్ కల్యాణ్ తో పాటు ఆయన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటిస్తాడంటూ ఇప్పటికే కథనాలొచ్చాయి. అయితే అందులో నిజం లేదు.
వినోదాయ శితం రీమేక్ లో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించబోతున్నారు. ఈ మేరకు తన అంగీకారాన్ని తెలిపాడు సాయితేజ్. ఒరిజినల్ తో పోలిస్తే, ఈ సినిమాలో పవన్ కల్యాణ్ రోల్ తక్కువగా ఉండాలి, సాయితేజ్ పాత్ర ఎక్కువగా ఉండాలి. కానీ తెలుగు రీమేక్ లో భారీ మార్పులు చేయబోతున్నాడు త్రివిక్రమ్. పవన్ కల్యాణ్ పాత్రను పెంచబోతున్నాడు, దానికి మాస్ అప్పీల్ కూడా తీసుకురాబోతున్నాడు. అతడితో పాటు సాయిధరమ్ తేజ్ పాత్ర ట్రావెల్ చేస్తుంది.
జీ స్టుడియోస్, పీపుల్ మీడియా బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఆ సినిమా పూర్తయిన తర్వాత వినోదాయ శితం రీమేక్ పై అధికారిక ప్రకటన వస్తుంది.