కెరీర్ లో తొలిసారిగా అత్యధిక పారితోషికం అందుకుంటున్నాడు హీరో సాయితేజ్. పవన్ కల్యాణ్ తో కలిసి చేయాల్సిన వినోదాయ శితం రీమేక్ కోసం, తేజ్ కు భారీ రెమ్యూనరేషన్ అందిస్తోంది పీపుల్ మీడియా సంస్థ. అయితే ఇంత పారితోషికం ఇవ్వడం వెనుక అసలు కారణం మరొకటి ఉంది.
వినోదాయ శితం రీమేక్ కోసం సాయితేజ్ వరుసగా 3 నెలల పాటు టైమ్ కేటాయించాలి. మధ్యలో మరో సినిమా లేదా యాడ్ చేయకూడదు. అంతేకాదు, ప్రస్తుతం చేస్తున్న మూవీని కూడా పక్కనపెట్టేయాలి. ఈ కండిషన్స్ కు అంగీకరిస్తేనే భారీ పారితోషికం ఇస్తామన్నారు. వీటికి సాయితేజ్ అంగీకరించాడు. వెంటనే సంతకం పెట్టాడు.
సాయితేజ్ తో ఇలాంటి ఒప్పందం చేసుకోవడం వెనుక కారణం పెద్ద కారణమే ఉంది. ఈ సినిమాకు పవన్ విడతల వారీగా కాల్షీట్లు ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు సెట్స్ పైకి వస్తాడో, ఎప్పుడు పొలిటికల్ ఎఫైర్స్ తో బిజీ అవుతాడో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే పవన్ అందుబాటులోకి వచ్చిన ప్రతిసారి, సాయితేజ్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ రకంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.
ఓవైపు మేనమామ పవన్ తో నటించడం, ఇంకోవైపు భారీ పారితోషికం.. ఈ రెండు కారణాలతో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో చేస్తున్న సినిమాను సాయితేజ్ 3 నెలల పాటు పక్కనపెట్టేశాడు. మళ్లీ అక్టోబర్ తర్వాతే తేజ్, ఇతర నిర్మాతలకు, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రుద్రవనం సినిమాకు అందుబాటులోకి వస్తాడు.