అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను చంపుతానంటూ ట్రక్కుతో వెళ్లి వైట్ హౌస్ బారికేడ్లను ఢీకొన్న భారత సంతతి యువకుడు సాయి వర్షిత్ కందుల కు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష , రూ. 2 కోట్ల జరిమానా విధించే అవకాశాలున్నాయి.బుధవారం ఫెడరల్ కోర్టు జడ్జి రాబిన్ మెరివెదర్ ఎదుట వర్షిత్ ను హాజరుపరచగా, మే 30 దాకా కస్టడీకి ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాలోని మిసోరి రాష్ట్రానికి చెందిన సాయి వర్షిత్ గత సోమవారం రాత్రి ఓ ట్రక్కు నడుపుతూ వైట్ హౌస్ దిశగా దూసుకుపోయి బారికేడ్లను ఢీకొనడంతో భద్రతా సిబ్బంది అతణ్ని నిర్భందించిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ట్రక్కులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్థారించిన పోలీసులు జర్మనీ నియంత హిట్లర్ కు చెందిన నాజీల జెండాను అందులో గుర్తించారు. బైడెన్ ను తొలగించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యమని ప్రకటించిన వర్షిత్ తానొక నిరుద్యోగ డేటా అనలిస్ట్ గా పరిచయం చేసుకున్నాడు.
ఆరెంజ్ కలర్ జంప్ సూట్ లో కోర్టుకు హాజరైన వర్షిత్ జడ్జి అడిగిన ప్రశ్నలకు వినయంగా, పొడిగా బదులిచ్చాడు. ఆస్తుల విధ్వంసం, నిర్లక్ష్యంగా వాహనం నడపటం, అధ్యక్షుణ్ని చంపుతానని బెదిరించటం , అనుమతి లేకుండా చొరబడటం..ఇలా పలు అభియోగాలను వర్షిత్ పై పోలీసులు నమోదు చేశారు.
ఈ నేరాలకు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా విధించే అవకాశమున్నట్లు నిందితుడికి చెప్పిన న్యాయమూర్తి వచ్చే వారం తదుపరి విచారణ ఉంటుందన్నారు.