గిరిజన బాలిక అత్మకు శాంతి చేకూరాలంటే.. నిందుతుడ్ని కఠినంగా శిక్షించాలి. కానీ.. ఇప్పటివరకు ఆ నరరూప రాక్షసుడ్ని పట్టుకోలేదు. మూడు రోజుల క్రితం రెండు గంటల్లో పట్టుకుంటాం.. మా టీమ్ ఆ దుర్మార్గుడిని వెంటాడుతోందని చెప్పిన డీసీపీ రమేష్ రెడ్డి… నాలుగు రోజులైనా అతడి జాడ కనిపెట్టలేకపోయారు. ఇటు న్యాయం కోసం రోడ్డెక్కిన చిన్నారి తల్లిదండ్రులను చితకబాదారు పోలీసులు.
కేటీఆర్ అయితే ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. వాడికి శిక్ష పడేలా చేయాలన్నారు. నిందితుడు రాజును పోలీసులు ఇంకా పట్టుకోలేదనే విషయం కూడా తెలియకుండానే కేటీఆర్ పోస్ట్ చేశారంటే ఆయనకు ఎంత చిత్తశుద్ది ఉందో అర్థం అవుతోందని అంటున్నాయి ప్రతిపక్షాలు.
ఇంత నిర్లక్ష్యం ఎక్కడైనా కనిపిస్తుందా..? 10 బృందాలు తిరుగుతున్నాయని చెప్పిన పోలీసులు.. వంద మందితో సమానమైన సీసీ కెమెరాలు ఏం చేస్తున్నట్లు. అత్యాచారం చేసి.. కాళ్లు, చేతులు విరగొట్టి అత్యంత కిరాతంగా హత్య చేసి మూట కట్టి.. ఇంట్లో పెట్టి గంటల కొద్దీ అక్కడే తిరిగాడు. తల్లిదండ్రులు అడగ్గా.. గప్ చిప్ లు తింటూ అవునా.. పాప కోసం వెతుకుతున్నారా అని సమాధానం ఇచ్చిన వ్యక్తిని ఇంకా పట్టుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మీడియా మొత్తం తమ గుప్పిట్లో ఉంది.. ఏదిచెబితే అదే చూపిస్తారు.. బయటి ప్రపంచానికి ఏమీ తెలియదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కొన్ని ప్రధాన ఛానళ్ల తీరుపైనా తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ ను బ్యాన్ చేయాలని ప్రచారం కూడా జరుగుతోంది.