అందమైన హైదరాబాద్ లో అన్ని వర్గాల ప్రజలు జీవిస్తుంటారు. కోట్లు విలువ జేసే హైక్లాస్ ఏరియాలకు ఆనుకుని చాలా బస్తీలు ఉంటాయి. మరికొన్ని చోట్ల గుడిసెలు కనిపిస్తుంటాయి. దీన్ని ఆక్రమణగా చెబుతూ అప్పుడప్పుడు అధికారులు ఖాళీ చేయించడం చేస్తుంటారు. కొద్ది రోజుల క్రితం సైదాబాద్ లో అలాగే చేశారు. కానీ, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల ఒత్తిడి వల్లే ఇదంతా చేశారని బాధితులు వాపోతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సైదాబాద్ లోకాయుక్త కాలనీలో ప్రభుత్వేతర భూమిలో 50 ఏళ్లుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు పేదలు. 850 గజాలలో 37 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు ఈమధ్యే ఆ గుడిసెలను ఖాళీ చేయించారు. దీంతో వారంతా సైదాబాద్ ఎస్బీహెచ్ కాలనీ, ఏ-వన్ కమ్యూనిటీ హాల్ లో ఆశ్రయం పొందుతున్నారు. బాధితుల బాధను తొలివెలుగు కూడా ప్రసారం చేసింది.
అయితే.. 12 రోజుల నుంచి తిండి, నిద్ర లేక 37 కుటుంబాలు దుర్భరమైన జీవితం గడిపాయి. చివరకు సహనం కోల్పోయిన వారంతా.. మూకుమ్మడిగా గుడిసెలు ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. మలక్ పేట్ ఎమ్మెల్యే బలాలతో తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తాము 50 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నామని, కరెంట్, నల్లా కనెక్షన్లు ఉన్నా, ట్యాక్స్ లు కడుతున్నా అది ప్రైవేట్ భూమి అంటూ తమను బలవంతంగా ఖాళీ చేయించారని వాపోతున్నారు. ఇండ్లకు సంబంధించిన అన్ని ఒరిజినల్ పేపర్లను గుంజుకుపోయారని, పిల్లలున్నారని కూడా చూడకుండా రోడ్డున పడేశారని కన్నీరు పెట్టుకున్నారు బాధితులు.