వైసీపీ ప్రభుత్వం ప్రతీ నెలా పెన్షన్లు తొలగిస్తోందని మండిపడ్డారు ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్. తక్షణమే అర్హులైన వారందరికీ పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే అక్టోబర్ నెల నుంచి అయినా వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి… 54 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని… ఏవేవో కారణాలతో వారిలో 4 లక్షల మందిని తొలగించారని ఆరోపించారు. తర్వాత 10 లక్షల పెన్షన్లు మంజూరు చేయడంతో సంఖ్య 60 లక్షలకు చేరిందని వివరించారు. అయితే మళ్లీ ఇప్పుడు అనర్హులు అంటూ కొందర్ని తీసేస్తున్నారని మండిపడ్డారు.
సంక్షేమ పథకాలు పెరిగిపోవడం, ప్రతి నెలా నగదు బదిలీకి నిధులు అందకపోవడంతో ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యపై కోత పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు శైలజానాథ్. ఇప్పటికే రెండు లక్షల పింఛన్లను కోసేశారన్న ఆయన.. ఇంకో 10 లక్షల పెన్షన్లకు ఎసరు పెట్టారని విమర్శించారు. ఈ లిస్టులో అన్ని అర్హతలు ఉండి.. పింఛన్లు పొందుతున్న వారి పేర్లే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. వారిని ఏ ప్రాతిపదికన తీసేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.