రష్యా, ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్దంలో ఉక్రెయిన్ సైనికులు వీరోచితంగా పోరాడుతున్నారు. ఉక్రెయిన్ ను కాపాడుకోవాలనే ఉద్ధేశ్యంతో అనేక మంది పౌరులు సైన్యంలో చేరి వీరోచితంగా పోరాడుతున్నారు.అందులో స్వదేశీ పౌరులతో పాటు.. భారత్ కు చెందిన సైనికేశ్ రవిచంద్రన్ కూడా సైన్యంలో చేరాడు.
తాజాగా.. తాను ఇండియాకు రావాలనుకుంటున్నట్టు అతని తల్లి మీడియాకు చెప్పింది. ఇటీవల తాను కుటుంబంతో ఫోన్ లో మాట్లాడాడని.. ఆర్మీలో చేరాలనే తన కోరిక నెరవేరిందని.. తాను ఇంటికి రావాలనుకుంటున్నానని చెప్పాడని అతని తల్లి వెల్లడించింది. ఓ పక్క యుద్ధం జరుగుతున్నందున తమతో ఎక్కువ సేపు మాట్లాడలేదని చెప్పింది.
తమిళనాడు, కోయంబత్తూర్ కు చెందిన 21ఏళ్ల సైనికేశ్ రవిచంద్రన్.. భారత సైన్యంలో చేరేందుకు రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. కానీ ఇక్కడ అవకాశం లభించకపోవడంతో నిరాశ పడ్డాడు. ఇంతలోనే రష్యా, ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించడంతో.. అతను ఉక్రెయిన్ సైన్యంలో చేరాలనుకున్నాడు.
అందుకు తమిళనాడు ఇంటెలిజెన్స్, కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించాయి. దీంతో అతను ఉక్రెయిన్ సైన్యంలో చేరి రష్యాకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేస్తున్నాడు. అయితే.. అతను ఉక్రెయిన్ లోని ఖర్కివ్ నేషనల్ వర్సిటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.