టీడీపీ, జనసేన పొత్తులపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి పక్ష నేతలు ఎందుకంత రహస్యంగా సమావేశమవుతున్నారని ఆయన ప్రశ్నించారు. తమ అక్రమ సంబంధాలను సక్రమం అని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత చేపట్టిన జగన్ ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేండ్లు పూర్తయింది. ఈ క్రమంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు.
ముందస్తు ఎన్నికల వార్తలపై ఆయన స్పందించారు. ముందస్తుకు వెళ్లాలన్న ఆళోచనలో సీఎం జగన్ లేరని ఆయన స్పష్టం చేశారు. ఐదేండ్ల కాలానికి ప్రజలు తీర్పునిచ్చారని ఆయన అన్నారు. అందువల్ల పూర్తి కాలం పాటు సీఎం జగన్ పాలిస్తారని ఆయన వివరించారు.
తాము సజీవంగా ఉన్నామని చెప్పేందుకే ప్రతిపక్షాలు ముందస్తు ప్రకటనలు చేస్తున్నాయన్నారు. చంపిన వాళ్ళను పరామర్శించటం ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. 11 మంది ప్రాణాలు తీసిన వ్యక్తిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.
జనసేన, టీడీపీలు కలిసిపోవడాన్ని వామపక్షాలు స్వాగతించటం చాలా విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ కూడా కలిస్తే మరి వామపక్షాలు ఎలాంటి వైఖరిని అవలంభిస్తాయో చూడాలన్నారు. అప్పుడు ఎరుపు, కాషాయం కలిసి పసుపు అవుతుందేమోనని ఆయన ఎద్దేవా చేశారు.
సిద్ధాంతాలతో కానీ, ప్రజల మీద ప్రేమతో కానీ, విలువలతో కానీ పోరాడలేక ఇలా అడ్డదారిలో వాళ్లు వస్తున్నారని అన్నారు. వాళ్లు పడుతున్న తిప్పలు చూస్తుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో బలవంతుడన్న విషయం తెలుస్తోందని వ్యాఖ్యానించారు.