ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వచ్చిన ఆరోపణల విషయం గురించి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఎంపీ మాధవ్ పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం విచారణ జరుగుతోందన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఎంపీ మాధవ్ ఖండిస్తున్నారని.. అది మార్ఫింగ్ వీడియో అని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అతని ఫిర్యాదుపై పోలీసు విచారణ జరుగుతోందని.. ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. మహిళలను కించపరిచేలా ఎవరైనా వ్యవహరిస్తే పార్టీ సహించదని స్పష్టం చేశారు.
“ఎంపీ గోరట్ల మాధవ్‌కు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోపై పోలీస్‌స్టేషన్‌లో మాధవ్ ఫిర్యాదు చేశారు. విచారణలో తెలియాల్సి ఉంది. దాన్ని బట్టి మార్ఫింగ్ కాదు అని తెలిస్తే చర్యలు తీసుకుంటాం. దర్యాప్తు సాగుతుంది. ఆరోపణలను ఎంపీ మాధవ్ ఖండిస్తున్నారు. నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని” సజ్జల తెలిపారు.