ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్, షర్మిల మధ్య ఇప్పటివరకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తెలంగాణలో వైసీపీలాంటి పార్టీ ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని అభిప్రాయపడ్డారు. షర్మిల పార్టీ పెట్టకుండా నచ్చజెప్పే ప్రయత్నాలను తాము చేశామన్న ఆయన.. ఆమె నిర్ణయం జగన్‌ను కాస్త బాధకు గురిచేసి ఉంటుందని చెప్పారు.
తెలంగాణ, ఏపీ మధ్య సంబంధాలు దెబ్బతినకూడదనే జగన్.. తెలంగాణలో వైసీపీని విస్తరించలేదని సజ్జల తెలిపారు. వైసీపీని ఇతర రాష్ట్రాలకు విస్తరించడం ఆయనకు ఇష్టం లేదని చెప్పారు. షర్మిలకు పదవి ఇవ్వడం జగన్‌కు పెద్ద కష్టం కాదని, కానీ పార్టీని కుటుంబపరం చేయొద్దనే అయన భావిస్తుంటారని చెప్పుకొచ్చారు. షర్మిలకు జగన్ ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయన్నారాయన.