తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ ఎన్నికల్లో గెలిచినంత ఆత్రుత చంద్రబాబులో కనిపించిందంటూ ఎద్దేవా చేశారు. మూడు ఎమ్మెల్సీల్లో గెలిచి మాపై వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు పిట్టల దొర, కమెడియన్ మాట్లాడినట్టు ఉన్నాయని సెటైర్లు వేశారు.
నిజంగా చంద్రబాబుకు దమ్ము.. ధైర్యం ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయి అంటూ సవాల్ విసిరారు. 2019లో మిమ్మల్ని ప్రజలు తుక్కు తుక్కుగా తొక్కారుగా.. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్రెస్ లేకుండా ఓడిపోయిన పరిస్థితి గురించి ఏం చెబుతారు?, దత్త పుత్రుడు లేకుండా అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఎందుకు? అంటూ ప్రశ్నించారు.
పశ్చిమ రాయలసీమ ఎన్నికల్లో అధికారులు వ్యవహరించిన తీరు అభ్యంతకరంగా ఉందన్నారు. టీడీపీలోని పెద్ద పెద్ద నాయకులు ఏజెంట్లుగా వచ్చి కూర్చున్నారు.. అసలు మేం అధికారంలో ఉన్నామా? అని మాకే ఒక్కోసారి అనుమానం వస్తుందంటూ వ్యాఖ్యానించారు.
ఎవరైనా దళితుడిగా పుట్టాలనుకుంటారా.. అన్న వ్యక్తి చంద్రబాబు అంటూ గుర్తు చేశారు. చంద్రబాబుతో చెప్పించుకునే పరిస్థితిలో వైసీపీ లేదన్నారు. చంద్రబాబు రిజెక్టెడ్ పొలిటీషియన్.. ఈ జీవితంలో శాసనసభలో అడుగు పెట్టే అవకాశాన్ని కోల్పోయాడు అంటూ పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.