ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పొత్తులపై చర్చలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీతోనే ఉన్నానని, బీజేపీ కాదంటే వేరే వాళ్లతో పొత్తులు ఉంటాయని, అది కూడా కుదరకపోతే ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణా రెడ్డి రియాక్ట్ అయ్యారు. పొత్తుల గురించి పవన్ చెప్పిన మూడు ఆప్షన్స్ వింటే నవ్వొస్తుందని సెటైర్లు వేశారు.
షరతులు లేకుండా చంద్రబాబుకి సపోర్టు చేయడం అనే నాలుగో ఆప్షన్ కూడా చెప్పాల్సిందంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళుతున్నారన్నారు. సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం అయ్యాయని పవన్ ఎలా చెప్పగలరన్నారు. అందుకు ఆయన వద్ద ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు.
నిజంగా మీ ఇద్దరిలో.. ఎవరు సీఎం అభ్యర్థి ఎవరో చెప్పి ఎన్నికలకు వెళ్లగలరా? అని సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే పొత్తుకు వెళుతున్నానని ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రజలకు కూడా ఒక స్పష్టత ఇస్తే బాగుంటుందని అన్నారు. విడివిడిగా వచ్చినా, కలిసి వచ్చినా మాకు ఒకే అన్నారు.
మాకు అయితే ఎలాంటి గందరగోళం లేదు.. వైసీపీలో సీఎం అంటే జగన్ ఒక్కరే అని స్పష్టం చేశారు. లోకేష్ పాదయాత్రలో.. వాళ్ల నాన్నను ముఖ్యమంత్రిగా చేయమని కోరతారా? అని ప్రశ్నించారు. లోకేష్ పాదయత్రను టీడీపీ ఎక్కువగా ఊహించుకుంటోందని ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణా రెడ్డి.