రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయానికి సంబంధించి రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా బ్లాకుల వారీగా గంపగుత్తగా అమ్మాలని చూసిన ప్రభుత్వం.. కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఫ్లాట్లను వేర్వేరుగా అమ్మాలని నిర్ణయం తీసుకంది. ప్రజలు ఎవరైనా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సాధారణ పౌరులు, ఉద్యోగులు ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలని అధికారులకు స్పష్టం చేశారు.
బండ్లగూడ, పోచారంలలో ఉన్న స్వగృహ ఫ్లాట్ల విక్రయంపై విధివిధానాల రూపకల్పనకు అధికారులతో వేముల చర్చించారు. ఫ్లాట్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండడంతో లాటరీ పద్ధతిలో ఎంపిక చేయాలని మంత్రి సూచించారు. దరఖాస్తు రుసుంను రూ.1,000 గా నిర్ణయించారు. బండ్లగూడలో 1501 ఫాట్లు అమ్మకానికి ఉన్నాయి. ఇందులో నిర్మాణ పనులన్నీ పూర్తయినవి దాదాపు 419 ఫ్లాట్లు ఉన్నాయని సమాచారం. వీటి ధర చదరపు అడుక్కీ రూ.3,000 కాగా.. మిగతావి చదరపు అడుక్కీ రూ.2,750 చొప్పున విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఆసక్తి కలిగినవారు మీ-సేవా ద్వారా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు మంత్రి వేముల. దీనికోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెస్తామన్నారు. అర్హులకు బ్యాంక్ లోన్ సౌకర్యం ఉంటుందని వెల్లడించారు. పేపర్ లో నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి 30 రోజుల వరకు www.swagruha.telangana.gov.in సైట్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని మంత్రి వేముల అధికారులకు సూచించారు. అయితే.. మంత్రి ప్రకటనపై స్పందించిన కొనుగోలు దారులు.. ఆన్‌లైన్ లేదా మీ సేవలో బుక్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉందంటున్నారు. ప్లాట్లు చూసిన వెంటనే అక్కడికక్కడే దరఖాస్తు చేసుకునేలా ఏర్పాటు చేయాలంటున్నారు.
అపార్టుమెంట్ కొన్న తర్వాత.. అందులో నివసించేవారికి నిర్వహణపరంగా రకరకాల సమస్యలు వ్యక్తమవుతున్నాయి. ఆ సమస్యల పరిష్కారాలకు ఎవరు బాధ్యతలు తీసుకుంటారు..? ఆ బాధ్యతలను ప్రభుత్వమే స్వీకరిస్తోందా..? ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తోందా..? అనే అంశాలపై హౌసింగ్ బోర్డు కొనుగోలుదారులకు స్పష్టతనివ్వాలంటున్నారు. పదేళ్లకు పైగా ఖాళీగా ఉన్న అపార్టుమెంట్ల స్ట్రక్చర్ ఎలా ఉందనే సందేహాన్ని అధికారులు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. పునాదుల నాణ్యత ఎలా ఉంది..? శ్లాబులు దృఢంగా ఉన్నాయా..? ఇలాంటి సాంకేతిక అంశాల గురించి అధికారులు ప్రజలకు ప్రత్యేకంగా వివరించి.. కొనేవారికి నమ్మకం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు మంత్రి.