తెలంగాణ అమర్‌నాథుడిగా పిలువబడే సలేశ్వరుడి యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. అయితే, ఈసారి జాతర మూడ్రోజుల పాటే కొనసాగనుండటంతో లింగమయ్య దర్శనానికి.. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా పొటెత్తారు. దీంతో కైలాసనాథుడు కొలువై ఉన్న అటవీ ప్రాంతమంతా శివనామస్మరణతో మార్వోగుతోంది. కాగా, ఆదివారంతో యాత్ర ముగియనుంది. అయితే, సలేశ్వరనాథుడి దర్శనానికి వచ్చే భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వెయ్యి అడుగుల లోయలో సలేశ్వరుడు కొలువై ఉన్నాడు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా సలేశ్వరం యాత్ర నిలిపివేయడంతో ఈసారి కైలాసనాథుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 24 గంటల పాటు కాలినడకన సలేశ్వరం చేరుకునే వెసులుబాటు గతంలో ఉండేది. కానీ ఇప్పుడు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే సలేశ్వరం చేరుకోవాలని అధికారులు ఆంక్షలు విధించారు.
అలాగే, టోల్ ఛార్జీలు కూడా ఐదింతలు పెంచడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్, ఆటోకు రూ.500, కారు, జీపు, లారీ, బస్సు, డీసీఎంలకు రూ.1,000, టూ వీలర్స్‌కు రూ.100 చొప్పున టోల్ ఫీజులు వసూలు చేస్తున్నారు అధికారులు. ఇక ఆర్టీసీ సంస్థ వివిధ డిపోల నుంచి బస్సులను నడుపుతోంది. రెండు మార్గాల మీదుగా సలేశ్వరానికి భక్తులు చేరుకుంటున్నారు. అయితే, నడకదారిలో అధికారులు కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 7 కిలో మీటర్ల నడక దారిలో ఉచిత నీటి సౌకర్యం, భోజన సౌకర్యం కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, రూ.20 వాటర్ బాటిల్‌ను రూ.50, రూ.60 లకు విక్రయిస్తున్నారని వాపోతున్నారు. పోలీసులు కూడా ప్రవేశద్వారం వద్దే ఉన్నారని.. దిగుడు ప్రదేశంలో రాళ్లు జారుతున్నాయని మధ్యలో ఏమైనా అయితే పట్టించుకోనే వారే లేరని, కరెంట్ తీగలు కూడా చేతికి అందేంత ఎత్తులోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా శుక్రవారం కురిసిన వర్షానికి వాహనాలన్ని బురదలో కురుకుపోయాయని తెలిపారు. అధికారులు ఆంక్షలతో పాటు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.