వేసవి కాలం వస్తుంది అంటే లేదా జ్వరాల సీజన్ వస్తుంది అంటే చాలు సెలైన్ తో ఎక్కువగా అవసరం ఉంటుంది. సెలైన్ ఒకానొక సందర్భంలో మన ప్రాణాలను కాపాడుతుంది. డీ హైడ్రేషన్ తర్వాత సెలైన్ లేకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువ అనే చెప్పాలి. ఇక సెలైన్ వాటర్ విషయంలో చాలా మందికి ఉండే సందేహం ఏంటీ అంటే… సెలైన్ వాటర్ అంటే ఒక విధంగా ఉప్పు నీరే కదా…?
అలాంటిది దానిని శరీరంలోకి ఎక్కించడం అనేది ఎందుకు అంత ముఖ్యం అనే సందేహం చాలా మందిలో ఉంది. సెలైన్ సొల్యూషన్ అంటే ఉప్పు నీరు అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. మన శరీరం లోకి ఎక్కించేది 0.9% సెలైన్ అంటే 100 మిల్లి లీటర్ల స్టెరైల్ నీటిలో 0.9గ్రాముల సోడియం క్లోరైడ్ (ఉప్పు) మాత్రమే ఉంటుంది. శరీరం లోని కణాల్లో, చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ లో ఎలక్ట్రోలైట్స్ (లవణములు) సమతుల్యంగా ఉండేలా చూస్తారు.
బయట ఎక్కువ శాతం లవణములు ఉండి, కణాల్లో తక్కువ అయినా, లేక కణాల్లో ఎక్కువ శాతం ఉండి బయట తక్కువైనా ఈ స్థిరత్వం కోల్పోయి ప్రమాదానికి దారి తీసే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు ఉత్తి నీరే ఎక్కిస్తే అప్పుడు ఎర్ర రక్త కణాల్లో కి నీరు వెళ్లి కణాలు బద్దలు అయ్యే అవకాశం ఉంటుంది. దీన్నే వైద్య భాషలో హీమాలసిస్ అని పిలుస్తారు. అదే అధిక శాతం ఉప్పు నీరు (దాదాపు 4%) ఎక్కిస్తే… కణములలో ఉండే నీరు బయటకు వెళ్లి, కణాలు కృంగి నశించే అవకాశాలు ఉన్నాయి.
0.9% సెలైన్ కణాల చుట్టూ ఉండే ఫ్లూయిడ్ కి సమానంగా ఉంటుంది. అందుకే ఇంట్రా వీనస్ సెలైన్ 0.9% ఖత్చితం గా ఉండేలా తయారు చేస్తారు. ఎక్కువగా చెమట్లు పోసి… విరేచనాలు, వాంతులు అవుతున్నా లేదంటే, నోటి ద్వారా నీరు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాటి పరిస్థతులలో శరీరం లో నీటితో పాటు లవణములన్నీ బయటకు పోయి, కణాల్లో స్థిరత్వం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి… డాక్టర్లు, 0.9% సెలైన్, గ్లూకోస్ సెలైన్ మన శరీరంలో ఎక్కిస్తారు.