మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఓ కీ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరు-సల్మాన్ లపై ఓ యాక్షన్ బ్లాక్ షూట్ చేస్తున్నారు. దీనికోసం ముంబయిలో డీఎస్ స్టుడియోస్ లో ఓ ప్రత్యేకమైన సెట్ వేశారు.
మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పృథ్వీ రాజ్ చేసిన పాత్రలో మెగాస్టార్ కి అనుచరుడిగా కనిపించనున్నాడు సల్మాన్ ఖాన్. ప్రత్యేకంగా వేసిన సెట్ లో, ఫైట్ మాస్టర్ అనల్ అరుసు కంపోజ్ చేసిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు యూనిట్.
ఇటివలే హైదరాబాద్ లో కొంత పార్ట్ షూట్ చేసుకున్న ఈ సినిమా ముంబై షెడ్యుల్ తో దాదాపు షూటింగ్ పూర్తి చేసుకోనుంది. మిగిలిన బ్యాలెన్స్ వర్క్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రాసెస్ లో ఉన్నారు. ముందు నుండి మేకర్స్ చెప్తున్నట్లే సినిమాను ఈ ఏడాదిలోనే థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నారు. షూటింగ్ అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫాస్ట్ గా ఫినిష్ చేసి దసరా లేదా దీపావళి కి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ కు తెలుగులో ఇదే డెబ్యూ మూవీ. సల్మాన్ ఖాన్, చిరంజీవి కోసం.. ఒరిజినల్ తో పోలిస్తే తెలుగు వర్షన్ లో చాలానే మార్పులు చేశారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ , కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బానర్స్ పై ఆర్ .బి.చౌదరి సమర్పణలో ఎన్ వి ప్రసాద్, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు