ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం… ఒక కథానాయకుని చిత్రం మరో కథానాయకుడు సమర్పించడం. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి.. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా రణ్‌వీర్ సింగ్ నటించిన బ్రహ్మస్త్ర చిత్రాన్నిదర్శకుడు రాజమౌళి బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘విక్రాంత్ రోణా’.
ఈ సినిమాను హిందీలో సల్మాన్ ఖాన్ సమర్పిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో నటించారు. అయితే సినిమా హిందీ ట్రైలర్ లాంచ్ అనంతరం నిర్వహించిన సమావేశంలో సుదీప్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ.. మూవీ సక్సెస్‌కు ఫార్మూలా అనేది ఉండదన్నారు. ‘అన్ని సినిమాలు మంచి మూవీస్ అనే మొదలు పెడతాం.. కానీ కొన్ని ఆడతాయి. కొన్ని మూవీస్ ఆడవు’ అన్నారు సల్మాన్. ‘విక్రాంత్ రోణా’ బాగా ఆడాలనే తాను ప్రమోషన్స్ చేస్తున్నట్లు చెప్పారు సల్మాన్. ఎందుకంటే నష్టపోవడం తనకు ఇష్టం లేదన్నారు. ఇటీవల కాలంలో సౌత్ సినిమాలు నిజంగా బాగా ఆడుతున్నాయన్నారు.
అనంతరం సుదీప్ సౌత్- బాలీవుడ్ సినిమాలపై మాట్లాడారు. ‘కొన్ని దక్షిణాది మూవీస్ హిట్ అయినంత మాత్రాన.. సౌత్ సినిమా డామినేట్ చేస్తుందని అనుకోవద్దు. హిందీ చిత్ర పరిశ్రమ గొప్ప సినిమాలు తీసింది. గొప్ప నటులను అందించింది. లేకుంటే ఇన్ని ఏళ్లు ఎలా కొనసాగుతుంది?’ అన్నారు సుదీప్.
‘కోహ్లీ ఫామ్- బాలీవుడ్ పరిస్థితి రెండూ ఒక్కటే.. తక్కువగా అంచనా వేయలేం’ అయితే ప్రస్తుతం హిట్ సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న బాలీవుడ్‌ను.. ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీతో పోల్చారు సుదీప్. అలాగని బాలీవుడ్- కోహ్లీని తక్కువ అంచనా వేయలేమన్నారు. ‘విరాట్ ఇప్పుడు ఆడకపోతే అతని రికార్డులు చెరిగిపోతాయా? ప్రతి పరిశ్రమలో ఇలాంటి ఆటు పోట్లు వస్తాయి. అయితే తట్టుకొని నిలబడాలి’ అని పేర్కొన్నారు.
సౌత్- బాలీవుడ్ అని తేడా లేకుండా నటీనటుల మధ్య మంచి సఖ్యత, సహకారం ఉందన్నారు సుదీప్. ఆ సహకారం ఉంది కాబట్టే.. సల్మాన్ తన సినిమాను సమర్పిస్తున్నట్లు చెప్పారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇందులో నటించినట్లు వివరించారు.చిత్ర పరిశ్రమల మధ్య సహకారం ఎప్పటి నుంచో ఉందన్నారు సల్మాన్. కొన్ని కారణాల వల్ల ఈ మధ్య అది ఆగిపోయినట్లు చెప్పారు. తాను సౌత్ నుంచి వచ్చిన చాలా మంది ప్రతిభావంతులతో పనిచేసినట్లు గుర్తు చేశారు. ప్రకాష్ రాజ్, ప్రభుదేవాతో పాటు చాలా మంది సౌత్ డైరెక్టర్లు, డీఓపీలు ఇక్కడ పని చేసి.. పెద్ద హిట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.