సల్మాన్‌కి సడలింపు, నిర్మాతలు ఫుల్‌ హ్యాపీ

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌‌ఖాన్‌కు జోధ్‌పూర్‌ కోర్టులో మళ్లీ ఊరట. కృష్ణజింకలను వేటాడిన కేసులో ప్రస్తుతం బెయిల్‌పైవున్న ఆయనకు విదేశాలకు వెళ్లే అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. దీంతో తన మూవీల చిత్రీకరణ కోసం మే 25 నుంచి జులై 10 వరకు కెనడా, నేపాల్‌, అమెరికాలకు వెళ్లనున్నాడు.

భారత్, కిక్‌ 2, దబాంగ్‌ 3, రేస్‌ 3 ప్రాజెక్టుల చిత్రీకరణ విదేశాల్లో జరగాల్సివుందని, తనకు అమెరికా, కెనడా, నేపాల్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా జోధ్‌పూర్‌ కోర్టులో సల్మాన్ తరపు లాయర్ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. అనుమతి ఇచ్చింది. కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. రెండు రోజులు సెంట్రల్‌ జైల్లో గడిపిన ఆయన, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఐతే, దేశం దాటి వెళ్లకూడదని కోర్టు షరతు విధించిన విషయం తెల్సిందే!