బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను చంపుతామని బెదిరింపులు వచ్చాయి. దీనికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు లేఖ పంపారు. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ స్థానికంగా ఉన్న ఓ పార్కులో జాకింగ్ కు వెళ్లారు. అక్కడ ఓ బెంచ్ పై కూర్చోగా.. పక్కనే ఈ బెదిరింపు లేఖ వదిలి వెళ్లారు దుండగులు.
‘‘దివంగత పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే మీ తండ్రీకొడుకులకు కూడా పడుతుంది. ఇద్దరినీ చంపేస్తాం’’ అని దుండగులు లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు సల్మాన్ తండ్రి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల పంజాబ్ సింగ్ సిద్ధూ మూసేవాలను కాల్చి చంపారు. ఆయన కాన్వాయ్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిద్ధూ అక్కడికక్కడే మృతి చెందారు. వీవీఐపీలకు భద్రతను ఉపసంహరించుకున్న రెండురోజుల్లోనే ఈ ఘటన జరగింది. దీనిపై రాజకీయ దుమారం రేగడంతో అక్కడి ప్రభుత్వం వెనక్కి తగ్గి.. వీవీఐపీలకు భద్రత పెంచుతున్నట్లు ప్రకటించింది.
మరోవైపు సిద్ధూ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ కు సైతం భద్రతను పెంచారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఆయన ప్రమేయం ఉందని.. అతడిని చంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే భద్రతను రెట్టింపు చేశారు. అయితే.. ఇప్పుడు లేఖ పంపడం కలకలం రేపుతోంది.