బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ముంబైలోని స్థానిక కోర్టు సమన్లు జారీచేసింది. ఆయనతో ఆయన బాడీ గార్డుకు కోర్టు నోటీసులను పంపింది. జర్నలిస్టు ఒకరు దాఖలు చేసిన కేసుకు సంబంధించి ఈ నోటీసులు ఇచ్చింది.
వారిద్దరిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు న్యాయమూర్తి తెలిపారు. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 5 కు న్యాయమూర్తి వాయిదా వేశారు.
సల్మాన్ ఖాన్, అతని బాడీగార్డుపై జర్నలిస్ట్ అశోక్ పాండే కేసు పెట్టారు. ముంబై వీధిలో సల్మాన్ ఖాన్ సైకిల్ తొక్కుతుండగా కొంతమంది మీడియా వ్యక్తులు ఆయన ఫోటోలు తీశారని, ఆ సమయంలో తన ఫోన్ ను సల్మాన్ లాక్కున్నాడని జర్నలిస్ట్ పాండే ఆరోపించారు.
ఆ సమయంలో తనతో సల్మాన్ వాదనలకు దిగాడని, ఆ తర్వాత తనపై బెదిరింపులకు దిగాడని ఆయన ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.