టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించనున్న సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభం అయ్యింది. అయితే, సమంత దుబాయ్ పర్యటనలో ఉన్న కారణంగా ఈ కార్యక్రమానికి హాజరకాలేదు.
తాజాగా వెకేషన్ ముగించుకొని ముంబై ఎయిర్ పోర్ట్‌లో దర్శనమిచ్చింది సమంత. ఈ సినిమా షెడ్యూల్ కోసం అమ్మడు కాశ్మీర్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇది సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న రెండో సినిమా. 2018లో వచ్చిన సావిత్రి బయోపిక్‌లో జంటగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ఇక తాజా చిత్రంలో సమంత కాశ్మీర్ అమ్మాయిగా కనిపించనుంది. ఈ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు ఇంకా పేరు ప్రకటించలేదు చిత్రబృందం.
సమంత ఇటీవల నటించిన తమిళ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల కానుంది. ఇక దీనిని తెలుగులో ‘కెఆర్‌కె’ పేరుతో విడుదల అవుతుంది. హీరోగా విజయ్ సేతుపతి నటించగా.. మరో హీరోయిన్‌గా నయనతార నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి.