బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమాధాన్ యాత్ర పేరుతో ప్రజలను నితీశ్ కుమార్ మోసం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈ యాత్ర వల్ల ప్రజలకు పెద్దగా ఒరిగేదేమీ లేదన్నారు.
గోపాల్ గంజ్ జిల్లాలోని బరౌలిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జేడీయూ నేత నితీశ్ కుమార్ గతంలో పలు యాత్రలు చేపట్టారని పేర్కొన్నారు. ఆ యాత్రల వల్ల రాష్ట్రంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ సమాధాన్ యాత్ర నితీశ్ కుమార్ కు 14వ యాత్ర అన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన యాత్రలతో రాష్ట్రంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఈ యాత్ర కేవలం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మాత్రమేనని మండిపడ్డారు. యాత్రలో తన అభిమాన మంత్రులు, బ్యూరోక్రాట్లతో సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావన్నారు.
భారత్ జోడో యాత్రలో పలు పార్టీల నేతలు పాల్గొంటున్నారు. అయితే ఆ యాత్రకు నితీశ్ కుమార్ హాజరు కాకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. దీన్ని బట్టి ఆయన నైజం ఏంటో తెలుస్తోందన్నారు. ప్రతి పక్షాల ఐక్యత గురించి ఆయన మాటలు అపహాస్యం అవుతున్నాయని పేర్కొన్నారు.