సినీరంగంలో అడుగుపెట్టి అతితక్కువ టైమ్ లో అగ్రహీరోల సరసన నటించి సత్తాచాటింది సమంత. తనకు నచ్చిపాత్రలు చేస్తూ తనకు నచ్చినట్టు బతుకుతూ హేట్సాఫ్ సామ్ అన్నట్టే లైఫ్ లీడ్ చేస్తున్నారామె.
గత కొన్ని నెలలుగా మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. ఇటీవలే ఈ వ్యాధి నుంచి కోలుకున్న ఆమె. ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.
సామ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ పౌరాణిక చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులు ఈ చిత్రప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సామ్.
తాజాగా బిజినెస్ లోకి అడుగుపెట్టారు సమంత. భారతదేశపు మొట్టమొదటి సూపర్‌ఫుడ్ బ్రాండ్ ‘నరిష్ యు’ లో సమంత పెట్టుబడులు పెట్టారు. జెరోధాకు చెందిన నిఖిల్ కామత్, డార్విన్‌బాక్స్ రోహిత్ చెన్నమనేనిలు సైతం నరిష్ యు లో పెట్టుబడులు పెట్టిన వారిలో ఉన్నారు.
క్వినోవా, చియాను భారతదేశానికి తీసుకువచ్చిన తొలిబ్రాండ్ కావడంతో పాటుగా దేశీయంగా అభివృద్ధి చెందిన సూపర్‌ఫుడ్ స్టార్టప్, ‘నరిష్ యు’ (nourishyou) నేడు తమ కంపెనీలో సుప్రసిద్ధ నటి సమంత పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది.
దేశంలో క్వినోవా, చియా సీడ్స్‌ను విక్రయించిన సంస్ధగా ఆ సంప్రదాయం కొనసాగిస్తూ స్ధానికంగా సేకరించిన, సస్టెయినబుల్ సూపర్‌ఫుడ్స్ ను ప్రోత్సహిస్తుంది.
సమంత పెట్టిన పెట్టుబడులు ‘నరిష్ యు’ సీడ్ ఫండింగ్ రౌండ్లో భాగంగా వచ్చాయి. గతంలో ట్రైయంప్ గ్రూప్‌కు చెందిన వై జనార్థన రావు , డార్విన్ బాక్స్ కో–ఫౌండర్ రోహిత్ చెన్నమనేని, జెరోధా కో–ఫౌండర్ నిఖిల్ కామత్, గృహాస్ ప్రాప్‌టెక్ కో –ఫౌండర్ అభిజీత్ పాయ్, కిమ్స్ హాస్పిటల్స్ సీఈఓ అభినయ్ బొల్లినేని వంటి వారు ‘నరిష్ యు’లో పెట్టుబడులు పెట్టారు.
నరిష్ యులో పెట్టుబడులు గురించి సమంత మాట్లాడుతూ ‘‘గత కొద్ది కాలంగా ‘నరిష్ యు’ ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ఆ సంస్ధలో పెట్టుబడులు సహజంగానే జరిగాయి.
క్వినోవా, చియా సీడ్స్ వంటి సూపర్ ఫుడ్స్ ను ఇండియాకు తీసుకురావడంలో వారు పోషించిన పాత్ర, స్థానికంగా వారు ఎదిగిన తీరు, తృణధాన్యాల ఆధారిత క్లీన్ లేబుల్ వీగన్ సూపర్‌ఫుడ్స్ కోసం వారి ప్రొడక్ట్ రోడ్‌మ్యాప్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
వినియోగదారుల ఆరోగ్యంతో పాటుగా భూమ్మీద కూడా సానుకూల ప్రభావం తీసుకువచ్చేలా విలువను ‘నరిష్ యు’ సృష్టించనుందని నేను నమ్ముతున్నాను. వ్యాపారం పట్ల వారి వినూత్నమైన, స్ధిరమైన విధానంలో భాగం కావడం పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు.