పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ గడించిన కథానాయికల్లో సమంత ఒకరు. వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ తను ఆ స్థాయికి చేరుకుంది. జెస్సీ గా యువత మనసు దోచిన ఈ భామ.. ఆ తర్వాత నటన పరంగా ఎన్నో విమర్శల్ని ఎదుర్కొంది. అందంతో నెట్టుకొస్తోందే తప్ప.. యాక్టింగ్ రాదంటూ ఎందరో పెదవి విరిచారు.
అలాంటి వాళ్ళందరి నోళ్లు మూయించేలా ప్రతిభ చాటి జాతీయ స్థాయిలోనే తన సత్తా చాటుతోంది ఈ అందాల భామ. ముఖ్యంగా.. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నుంచి సమంత ఫుల్ బిజీ అయిపోయింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’ సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సమంత.. ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్‌లోనూ నటిస్తోంది.
అంతేకాకుండా.. మరో పాన్ ఇండియా సినిమాకు సంతకం చేసినట్టు సినీ వర్గాలు చెప్తున్నాయి. డెబ్యూ డైరెక్టర్ చెప్పిన కథతో ఇంప్రెస్ అయిన సమంత ఈ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపిందని అంటున్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలాఉంటే.. ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద సినిమాలతో బిజీగా ఉంది. ఈ రెండు సినిమాల పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగిసిన వెంటనే ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధం కానున్నాయి. మరోవైపు.. మరో వెబ్‌సిరీస్ కు అమెజాన్ ప్రైమ్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్టు సినీ వర్గాలు చెప్తున్నాయి.