టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రస్తుతం కెరీర్లో ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే ఆ మధ్యలో మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ వ్యాధి చికిత్స కారణంగా కొద్ది రోజుల పాటు షూటింగ్లకు కాస్త బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూనే చిత్రీకరణలో మళ్లీ బిజీగా పాల్గొంటోంది.
తెలుగులో ఇప్పటికే విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా గతేడాది జూన్లో తాత్కాలికంగా వాయిదా పడగా.. సామ్ అనారోగ్యం కారణంగా ఇంతవరకు ప్రారంభంకాలేదు. దీంతో అభిమానులు ఖుషీ సినిమా పునఃప్రారంభం గురించి సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. వచ్చే నెల మార్చి నుంచి సమంత ఖుషి సెట్లో తిరిగి అడుగుపెట్టనుందని తెలిసింది. ఈ విషయాన్ని సినీ వర్గాలు తెలిపాయి. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఇటీవలే ఈ విషయమై సామ్ కూడా మాట్లాడూతూ.. “విజయ్ దేవరకొండ అభిమానులను నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఖుషీ సినిమా త్వరలోనే మళ్లీ ప్రారంభమవుతుంది.” అని ట్విటర్ వేదికగా తెలిపింది. దీంతో సామ్ ఇచ్చిన ఈ గుడ్ న్యూస్తో విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అ్యయారు. అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఇకపోతే శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లక్ష్మీ, అలీ, రోహిణి, మురళీ శర్మ, జయరామ్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సచిన్ ఖేడ్కర్, శరణ్య, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విజయ్ దేవరకొండ సమంత తొలి సారిగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
ప్రస్తుతం సామ్.. అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సిటడల్ హిందీ రీమేక్లో నటిస్తోంది. ముంబైలో ఈ షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో షాహిద్ కపూర్ కూడా నటిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. సమంత కూడా ముంబయిలోనే ఓ ఇళ్లు కొనుగోలు చేసి అక్కడే ఉంటోంది.