స్టార్ హీరోయిన్ సమంత చేతులకు గాయాలు అయ్యాయి. గాయాల పాలైన చేతులను సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకోవడంతో.. అభిమానులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్ని నెలల పాటు ఇంటికే పరిమితం అయిన సమంత.. మళ్లీ ఇటీవలె కెమెరా ముందుకు వచ్చింది. ప్రస్తుతం `సిటాడెల్` వెబ్ సిరీస్ లో నటిస్తోంది.
.రుస్సో బ్రదర్స్ రూపొందిస్తున్న హాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్’కు ఇండియన్ వెర్షన్‌గా తెరకెక్కుతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. సిటాడెల్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇందులో సమంత మోడరన్ లుక్‌లో, స్టైలిష్ కాప్‌గా అలరించబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన సమంత ఫస్ట్ లుక్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. సిటాడెల్ చిత్రీకరణలో సమంత గాయపడినట్లుగా తెలుస్తోంది.
ఈ సిరీస్ లో సమంత పాత్రలో పూర్తిగా యాక్షన్ లో ఉంటుంది. అయితే సిటాడెల్ సిరీస్ లో కొన్ని హై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని.. ఇందుకోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ దగ్గర సామ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమంత గాయపడినట్లు సమాచారం. సమంత తన ఇన్‌స్టా ద్వారా షేర్ చేసిన ఫోటోలో ఆమె చేతులకు గాయాలు.. రక్తపు మరకలు కనిపిస్తున్నాయి.
దీంతో సమంతకు ఏమైంది అంటూ అభిమానులు హైరానా పడిపోతున్నారు. అయితే సమంత ఆరోగ్యం బాగానే ఉందని.. చేతులకు మాత్రమే గాయాలు అయ్యాయని అంటున్నారు. కాగా, సమంత ఇతర ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ఈమె నటించిన `శాకుంతలం` ఏప్రిల్ లో విడుదల కాబోతోంది. అలాగే మరోవైపు విజయ్ దేవరకొండకు జోడీగా `ఖుషి`లో నటిస్తోంది. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ లో సమంత త్వరలో జాయిన్ కానుంది.