ఈవా ఫర్టిలిటి సెంటర్ నిర్వాహకులతో వివాదం సద్దుమణిగిందని యశోద చిత్ర నిర్మాత శివలెంకల కృష్ణ ప్రసాద్ తెలిపారు. యశోద చిత్రంలో ఈవా ఫర్టిలిటీ సెంటర్ పేరును తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి యశోద సినిమాలో ఈవా పేరు కనిపించదని ఆయన వెల్లడించారు.
ఈవా ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకులకు ఆయన క్షమాపణ తెలిపారు. తమ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించిందంటూ హైదరాబాద్- వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఈవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఆ మరుసటి రోజే వారిని కలిసి పేరు తొలగిస్తామని చెప్పినట్టు నిర్మాత వెల్లడించారు. అన్నట్లుగానే పూర్తిగా ఆ పేరును తొలగించినట్లు ఆయన స్పష్టం చేశారు. యశోద సినిమాలో ఈవా పేరును ఒకరిని ఉద్దేశించి పెట్టలేదని ఆయన వివరణ ఇచ్చారు.
ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదన్నారు. అలాగే యశోద నిర్మాతలు తక్షణం స్పందించిన తీరుపై ఈవా ఐవీఎఫ్ ఎండీ మోహన్ రావు హర్షం వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో కేసును ఉపసంహరించుకున్నట్లు ఆయన చెప్పారు. తమ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకోవడానికే తాము కోర్టును ఆశ్రయించామని అంతే కానీ డబ్బుల కోసం కాదని మోహన్ రావు తెలిపారు