శివసేన ఉద్దవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాలకు కేటాయించిన నూతన గుర్తుల విషయంలో ఇంకా వివాదం కొనసాగుతోంది. తాజాగా ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించిన కాగడా గుర్తుపై సమతా పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
సమతా పార్టీని దివంగత నేత జార్జి ఫెర్నాండేజ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లు 1994లో స్థాపించారు. సమతా పార్టీకి కాగడా గుర్తును కేటాయించారు. ఆ తర్వాత నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కొన్ని సీట్లు కూడా సాధించారు. కానీ తర్వాత మెజారిటీ సభ్యులు జేడీయూలో చేరారు. దీంతో పార్టీ గుర్తింపును కోల్పోయింది.
తమ పార్టీ గుర్తును ఉద్దవ్ వర్గానికి కేటాయించడంపై సమతా పార్టీ ఎన్నికల సంఘానికి కూడా లేఖలు రాసింది. కాగడా గుర్తును సమగా పార్టీకి రిజర్వ్ చేశారని ఆ పార్టీ అధ్యక్షుడు ఉదయ్ మండల్ అన్నారు. తమ పార్టీకి ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఉద్దవ్ ఠాక్రేకు ఆ గుర్తు కేటాయించడం సరికాదన్నారు.
భవిష్యత్ బిహార్ ఎన్నికల్లో సమతా పార్టీ నుంచి పోటీకి తాము సిద్దమవుతున్నట్టు ఆయన తెలిపారు. అందువల్ల తమకు కాగడా గుర్తు కావాలని ఆయన అన్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేసినప్పటికీ ఎన్నికల సంఘం స్పందించలేదన్నారు. అందువల్ల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్టు ఆయన తెలిపారు.
మరోవైపు సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీకి రెండు కత్తులు, డాలు గుర్తును కేటాయించారు. దీనిపై నాందేడ్‌కు చెందిన సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అది ఖల్సా గుర్తును పోలి వున్నట్టు వారు పేర్కొంటున్నారు.
ఈ మేరకు నాందేడ్ లోని సచ్ కంద్ గురుద్వారా బోర్డు మాజీ సెక్రటరీ రంజిత్ సింగ్ కమతేకర్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయించిన గుర్తు ఖల్సా కమ్యూనిటీకి చెందిన మత గుర్తును పోలి వుందని, అందువల్ల ఎన్నికల గుర్తుగా ఉపయోగించకూడదని కోరారు.