తెలంగాణలో కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా తయారైంది. రైతు అవసరాన్ని ఆసరాగా చేసుకుని కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. పంటలకు వాడే ఎరువులను కల్తీచేసి సొమ్ము చేసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా లింగన్ పల్లి గ్రామానికి చెందిన చెన్నయ్య అనే రైతు… దోమ మండల కేంద్రంలోని రుద్ర ఎరువుల షాపులో 7 డీఏపీ సంచులను కొనుగోలు చేశాడు. అయితే.. పొలంలో చల్లుతున్న సమయంలో అనుమానం వచ్చి.. డీఏపీని తీక్షణంగా పరిశీలిస్తే ఇసుక కనబడింది.
ఈ కల్తీ వ్యవహారాన్ని వెంటనే గ్రామ సర్పంచ్ ద్వారా వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాడు చెన్నయ్య. డీఏపీ బస్తాలు పరిశీలించిన అధికారులు అది ఇసుక కాదని… రసాయన పదార్థమని చెప్పారు. ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని.. షాపు యజమాని ద్వారా పరిహారం ఇప్పిస్తామని వారు చెప్పినట్టు ఆరోపిస్తున్నారు రైతులు.
ఎన్నో ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నామని.. ఇసుకకి, రసాయనాలకి తేడా తెలియదా..? అని ప్రశ్నిస్తున్నారు రైతులు. తమ లాగా మిగిలిన రైతులు మోసపోవద్దని.. కల్తీ ఎక్కడ జరిగిందో గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పోతిరెడ్డిపల్లి రైతు కూడా ఇలాగే మోసపోయాడు. వ్యవసాయశాఖ అధికారులు, ఎరువుల షాపుల యజమానులు కుమ్మక్కయ్యారని అనుమానిస్తున్నారు రైతులు.