తెలంగాణలో ఇసుక మాఫియా ఆగడాలు ఏవిధంగా ఉన్నాయో.. దాని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఏంటో.. ఎన్నో కథనాలను తొలివెలుగు అందించింది. గులాబీ అండదండలతో ఇసుకాసురులు రూల్స్ పాటించకుండా ప్రకృతి సంపదను దోచేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు అధికారులు, ప్రజలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మహిళా వీఆర్ఏపై దాడికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి మహిళా వీఆర్ఏ శిరీషపై ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తి దాడి చేశాడు. నల్లమల అటవీ ప్రాంతం మొలచింతలపల్లిలో కృష్ణానది ఉండడం వలన ఇసుక పుష్కలంగా దొరుకుతోంది. దాంతో ఇసుక మాఫియా రెచ్చిపోతూ డబ్బులు దండుకుంటోంది. దీన్ని అరికట్టేందుకు రెవెన్యూశాఖ నిఘా ఏర్పాటు చేసింది. ఈక్రమంలోనే తమ ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుంటువా అంటూ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ నాగ మల్లయ్య అనే వ్యక్తి వీఆర్ఏ శిరీషపై దాడికి పాల్పడ్డాడు.
తహశీల్దార్ కార్యాలయంలో డ్యూటీ ముగించుకొని సొంత గ్రామానికి వెళ్తుండగా బస్సులో ప్రయాణికుల ముందే విచక్షణారహితంగా కొట్టాడని అంటున్నారు వీఆర్ఏ. తల, శరీరంపై గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇసుక మాఫియాకు చెందిన నాగ మల్లయ్యను కఠినంగా శిక్షించాలని వీఆర్ఏలు తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. తహశీల్దార్ రమేష్ కు వినతిపత్రాన్ని అందజేశారు.
నాగ మల్లయ్యను అరెస్ట్ చేయాలని వీఆర్ఏ సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. అతనిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు ఆ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు.