ఇసుక దందా కాసులను రాల్చుతుంది. దీంతో అధికార పార్టీలోని నేతలు రెచ్చిపోయి అక్రమంగా ఇసుక దందాకు ఎగబడుతున్నారు. చెక్ డ్యాం ల దగ్గరైతే అర్థరాత్రి దొంగల్లా ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయంలో తుంగతుర్తిలో సొంత పార్టీలోని ఇద్దరు నేతల మధ్య వార్ మొదలైంది.
తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలో అర్ధరాత్రి మళ్లీ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఇసుక తరలింపు విషయాన్ని తెలుసుకుని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామీలు అడ్డుకున్నారు. ఈ గ్రామంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక మాఫియాను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇక చెక్ డాం ల కోసం వాడే ఇసుకని అర్ధరాత్రి తుంగతుర్తి నియోజకవర్గంలో దొంగలు తయారై అక్రమంగా తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అయితే ఈ అక్రమ దందా గత నాలుగైదు ఏండ్లుగా జరుగుతుంది. ఈ విషయాన్ని కలెక్టర్ కు తానే వినతి పత్రం ద్వారా నాలుగేళ్ల క్రితం తెలియజేసినట్టుగా ఆయన అన్నారు. కానీ కలెక్టర్ కింద ఉన్న అధికారులు ఇసుక మాఫియాకు అండదండగా ఉన్నారని ఆయన ఆరోపించారు. ఇసుక అక్రమ తరలింపుతో రైతులకు నీళ్లు రాకుండా ఇక్కడ ఉన్న వనరుల్ని దోచుకుంటున్నారని చెప్పారు.
అయితే తుంగతుర్తి నియోజకవర్గంలో గత 40 ఏళ్లలో ఏనాడు రైతులు ఆధారపడ్డ ఏరులో ఇసుక దోపిడీ ఎన్నడూ జరగలేదన్నారు. కానీ గత నాలుగైదు ఏండ్లుగా ఇసుక దోపిడీ చేయడానికి ఎవరో ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. అడిగినందుకు బెదిరిస్తున్నారని ఈవిషయాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకొని వెళ్తానని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామీలు అన్నారు.