జమ్మికుంట మండలం తనుగుల ఇసుక క్వారీని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిశీలించారు. క్వారీల పేరుతో ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఒకే పర్మిషన్ మీద నాలుగు లారీల ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు.
నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలకు చూపెట్టడానికి తాను ఇక్కడకు వచ్చానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా కొంత మంది మాఫియాగా తయారై ఇసుక దందాకు తెరలేపారని మండిపడ్డారు.
అక్రమ ఇసుక రవాణా పై ఫిర్యాదు చేసిన వాళ్లపై దాడులకు పాల్పడుతున్నారని, ఫిర్యాదు చేస్తే ప్రభుత్వంలోని పెద్దలు గానీ, అధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మానేరు వాగులో ఇసుక దందా ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎడారిలా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక మాఫియా వల్లే కాళేశ్వరం కొట్టుకుపోయిందన్నారు. ఈ ఇసుక దందాలో సీఎం కేసీఆర్ కుటుంబానికి వాటా ఉందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు జోగినపల్లి సంతోష్,జోగిన పల్లి రవీందర్ రావు అక్రమంగా ఇసుకను తరలిస్తుంటే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
అయితే హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా..తనుగుల ఇసుక రీచ్ పరిశీలనకు వెళ్ళాల్సిన క్రమంలో రేవంత్ దారి తప్పారు. మొదట సరైన రూట్ మ్యాప్ లేకపోవడంతో గందరగోళానికి గురయ్యారు. ఇసుక రీచ్ కు వెళ్లేందుకు దారి తెలియక రెండు సార్లు రాంగ్ రూట్ కు వెళ్లారు. సింగిల్ రోడ్లల్లో కాన్వాయ్ లను తిప్పలేక ఇబ్బంది పడ్డారు.