పవర్ మా చేతిలో ఉంది..మమ్మల్ని ఆపేది ఎవడ్రా అన్నట్లు ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మీకు వీలున్న చోట చెప్పుకొండి..చేతనైంది చేసుకోండి..మేము మాత్రం మా పని ఆపేదిలేదంటూ బరితెగిస్తున్నారు. ఎవరైనా ఇదేంటి అని ప్రశ్నిస్తే..అడ్డొస్తే పై నుంచి ట్రాక్టర్ ఎక్కిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారులు ఎంత అడ్డుకట్టలు వేసినా ఆగడం లేదు.
దీనికి తోడు కొందరు రాజకీయ నాయకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలు ఉండటంతో నిజాయితీపరులైన అధికారులు కూడా చూసిచూడనట్లు పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎవరైనా ఆపేందుకు ప్రయత్నం చేసినా..అడ్డుకున్నా..అధికారులనే మందలించే దురదృష్టకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా కొందరు వ్యక్తులు కింది స్థాయి అధికారులను బెదిరించడంతో ఇసుకను పట్టుకునేందుకు జంకుతున్నారు.
మరో వైపు పోలీసుల కనుసన్నల్లోనే ఈ దందా కొనసాగుతుందనే ఆరోపణలున్నాయి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డు వస్తున్న వారికి మొదట డబ్బులు ఎరవేయడం..లేదంటే దాడులు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. 2022 డిసెంబర్ నెలలో బషీరాబాద్ మండలం ఇందర్ చెడ్ సమీపంలో ఇసుక ట్రాక్టర్ ను ఆపే ప్రయత్నంలో కానిస్టేబుల్ శంకర్ శివరామ్ ను ట్రాక్టర్ ఢీకొనడంతో అతడి రెండు కళ్లు విరిగిన విషయం తెలిసిందే.
అక్రమ ఇసుక దందాకు కొందరి అధికారుల ప్రస్తావనతోనే కొనసాగుతుంది. మార్చినెలలో బషీరాబాద్ మండలం గ్రామస్తులు ఏకమై మా శివారుల్లో ఇసుక రవాణా జోరుగా సాగుతుందని 100 కు డయల్ చేసిన చెప్పిన కూడా ఎలాంటి ఫలితం లేదు. ఇద్దరు పోలీసులు వచ్చి వెళ్లిపోయారు. దీంతో అక్రమార్కులకు పోలీసుల నుంచి సమాచారం చేరవేశారని అనుమానాలు వినిపిస్తున్నాయి. ఎవరైనా అక్రమ ఇసుక రవాణా పై ఫిర్యాదు చేస్తే ఫలనా వారి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఇసుక మాఫియాకు కొందరు పోలీసులు, వీఆర్వోలు సమాచారం అందిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.