వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామంలోని సర్వే నంబర్ 325 లో తొర్రు చెరువు కలదు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు నిండుకుండలా ఉంటూ పంట పొలాలకు నీరు అందిస్తోంది. అయితే ఈ చెరువు మీద మట్టి మాఫియా కన్ను పడింది. నిబంధనలకు విరుద్దంగా మట్టి మాఫియా ఇష్టారాజ్యంగా గత కొన్ని నెలల నుంచి తవ్వకాలు జరుపుతున్నారు.
తాండూరు పట్టణానికి బైపాస్ రోడ్డు రావడంతో బైపాస్ రోడ్డు నిర్మాణం కోసమని ఈ తొర్రు చెరువులో ఉన్న ఎర్రమట్టిని త్రవ్వడం ప్రారంభించారు. ఇష్టానుసారంగా రాత్రి పగలు తేడా లేక పెద్దపెద్ద యంత్రాలతో నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తవ్వుతూ అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన కోకట్ గ్రామస్తులు చెరువు పూర్తిగా నాశనం అవుతుందని తెలుసుకొని సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు కొన్ని నెలల నుంచి ఫిర్యాదు చేసిన ఫలితం లేదు.
ఎవరు ఫిర్యాదు చేసిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. మరోవైపు జరుగుతున్న తవ్వకాలకు ఎలాంటి పర్మిషన్ లేదని జిల్లా ఇరిగేషన్ అధికారి సుందర్ తెలిపారు. మట్టి తవ్వకాలను అక్రమంగా కూడా పలు వెంచర్లకు తరలిస్తున్నారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులే వారి బాబాయి నర్సిరెడ్డి ఈ తంతు నడిపిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు
పనికి ఆహారం పథకం కింద ఈ చెరువులో రోజు కూలిగా చేసుకునే తమకు ఇప్పుడు పని దొరకక ఇళ్ల దగ్గర ఖాళీగా ఉండిపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు పక్కనే స్కూలు ఉంది. ఇలా 70 అడుగుల లోతు తవ్వకాలు జరిపితే.. తర్వాత వర్షాలు పడితే ఈ చెరువులో విద్యార్థులు, పశువులు పడే అవకాశాలున్నాయి. పోలీసులు సైతం దగ్గర ఉండి మట్టి మాఫియా వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు.
అందుకు నిదర్శనం స్థానిక ఎస్సై అరవింద్ దగ్గర ఉండే వాహనాలు తరలించారని అన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా తల్లి నియోజక వర్గమైన తాండూరు లో ఇలాంటి ఘటన గురించి అధికారులు స్పందించకపోవడం విచారకరం అన్నారు. పాఠశాలకు దగ్గర ఉన్న ఇలాంటి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బాబాయ్ బైపాస్ రోడ్డు కాంట్రాక్ట్ నడపడం ఇందుకు ప్రధాన కారణం అని.. ఈ మట్టిని కూడా ఇక్కడి నుండి తరలిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారని అంటున్నారు.