గుంటూరు: ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల తరువాత కూడా ప్రజల్ని ఇసుక కష్టాలు వేధిస్తున్నాయి. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేస్తామంటూనే, ప్రభుత్వం సామాన్యుల అవసరాలకు ఇసుకను దూరం చేసింది. దీనితో ఇసుకపై ఆధారపడి కూలి నాలి చేసుకునే అన్ని రంగాల కార్మికులు నెలల తరబడి పనులు కోల్పోయి పస్తులుంటున్న దుస్థితి నెలకొంది. ఫలితంగా నిర్మాణ రంగం కుదేలయింది. నూతన ఇసుక కావలసిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇలా దరఖాస్తు చేసేందుకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. కేవలం 10 నిమిషాల్లోనే ఔట్ ఆఫ్ స్టాక్ అని వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇక మళ్ళీ తదుపరి రోజు 12 గంటలకు మాత్రమే వెబ్ సైట్ తెరుచుకుంటుంది. పోనీ వెబ్ సైట్ కనెక్ట్ అయి నమోదు చేసుకున్నప్పటికీ, రోజుల తరబడి నిరీక్షించాల్సిందే అని అంటున్నారు. ఆన్‌లైన్‌లో వెబ్ సైట్ ఓపెన్ అయ్యేందుకు సమయాన్ని నిర్ధేశించి జనాన్ని ఇబ్బంది పెట్టడం కన్నా వెబ్ సైట్‌ను అందుబాటులో ఉంచి ఓ సీరియల్ నంబర్ ఇస్తే మేలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక ప్రతి ధరఖాస్తుకూ ఇంటి ప్లాన్ తప్పనిసరి చేశారు.ఇసుకతో ముడి పడి ఉన్న చిన్న చిన్న పనులకు అవసరమయ్యే కొద్ది మొత్తానికి కూడా ఈ నిబంధన పెట్టటం విమర్శలకు తావిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ పని తీరుపై ఇసుక కొరత సామాన్య ప్రజల్లో వ్యతిరేకత పెంచిందనడంలో సందేహం లేదు. క్షేత్ర స్థాయిలో ప్రజలు, నిర్మాణ రంగాల్లో కూలీలు పడే ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించి ఇసుక సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.