దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటోంది. కశ్మీర్ పండిట్స్ ఎదుర్కొన్న ఇబ్బందులు, వారు పడిన కష్టాలను ఈ సినిమా ద్వారా కండ్లకు కట్టినట్టు దర్శకుడు వివేక్ చూపించారు.
అందుకే అభిమానుల నుంచి ప్రముఖుల వరకు ఆయన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇటీవల ఈ సినిమాను బాలీవుడ్ నటి సందీపా దార్ చూశారు. కశ్మీర్ తిరుగుబాటు సమయంలో ఆమె కుటుంబం మాతృభూమిని ఎలా విడిచి పెట్టాల్సి వచ్చిందో సినిమా చూస్తు్న్నంత సేపు గుర్తు చేసుకుంది.
ఆ తర్వాత తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ భావోద్వేగ పోస్టును ఆమె పెట్టారు. ఈ చిత్రం తమ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులకు దగ్గరగా ఉండటంతో తన మనసును కదిలించిందని వెల్లడించింది. ఈ చిత్రం తన గతాన్ని గుర్తు చేసిందని చెప్పారు.
కాశ్మీరీ పండిట్‌లు తమ మహిళలను విడిచిపెట్టి కాశ్మీర్ నుంచి వెళ్లిపోవాలని వారు ప్రకటించిన రోజు, తమ కుటుంబం అక్కడి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
ఆ సమయంలో ఓ ట్రక్కు వెనుకలో దాగి తనకుటుంబం పారిపోయినట్టు పేర్కొన్నారు. కశ్మీర్ పండిట్స్ గురించి వాస్తవాలను చూపించినందుకు వివేక్ అగ్నిహోత్రికి ధన్యవాదాలు అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చారు. దీంతో పాటు కశ్మీర్ లో తమ పాత ఇంటికి సంబంధించిన ఫోటోను కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.