సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును హైదరాబాద్ లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేగింది. హైదరాబాద్ వచ్చిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఉప్పలపల్లి కోర్టులో హాజరు పరిచారు. రూ.250 కోట్ల మేర మోసం చేశారంటూ శ్రీధర్ పై నటుడు అమితాబ్ బచ్చన్ బంధువులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ కు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేశారు.
అయితే శ్రీధర్ మాత్రం తాను మోసం చేశాననడం కరెక్ట్ కాదంటున్నారు. 180 కోట్ల రూపాయలను తానే చెల్లించానని పేర్కొన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. తన దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయన్న ఆయన.. వాటన్నింటినీ న్యాయస్థానం ముందు ఉంచుతానని తెలిపారు. ఈ ఇష్యూపై న్యాయపరంగా పోరాడుతానని చెప్పారు.
అమితాబ్ బచ్చన్ బంధువులను మోసం చేశాననడం అవాస్తవమన్నారు శ్రీధర్. తానెవర్నీ మోసం చేయలేదని మీడియాతో మాట్లాడారు. కేసు కోర్టులో ఉందని.. న్యాయ పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.
శ్రీధర్ రావుపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. గతంలోనూ ఆయన మూడుసార్లు అరెస్టయ్యారు. హైదరాబాద్ తో పాటు ముంబైలో పలువురు బిల్డర్లను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా పలు కేసులు నమోదయ్యాయి. మరి.. అమితాబ్ బచ్చన్ బంధువులను మోసం చేశారంటున్న ఈ కేసులో ఆయనకు ఎలాంటి చిక్కులు ఎదురవుతాయో చూడాలి.