ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ఇటీవల అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏ మాత్రమూ తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 10/10 జీపీఏ సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు అధికారులు సూచనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కూడా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలని వారికి సూచించారు. అత్యధిక మంది విద్యార్థులకు 10/10 జీపీఏ రావాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆయన సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశంలో వారికి పలు షరతులు కూడా పెట్టినట్టు తెలుస్తోంది. పాఠశాలలో ఎంత మంది విద్యార్థులకు 10/10 జీపీఏ తెప్పించగలరో తెలపాలని ఉపాధ్యాయుల నుంచి విద్యాశాఖ బాండ్ పేపర్ తీసుకున్నట్టు సమాచారం.
బాండ్ పేపర్ లో చెప్పినట్టు అంత మందికి 10/10 జీపీఏ తీసుకు రావాలని విద్యాశాఖ వారికి సూచనలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి . లేని పక్షంలో వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని బాండ్ పేపర్లలో రాయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్, విద్యాశాఖ నిర్ణయాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు.