తెలంగాణ పీసీసీ చీఫ్ రేస్ లిస్ట్‌లో కనీసం తన పేరైనా లేకపోవడంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెగ ఇదైపోతున్నారు. అధ్యక్ష పదవిని తానూ ఆశిస్తున్నానని చెప్పినా.. రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ పట్టించుకోలేదని చాలా ఫీల్ అవుతున్నారు. అయితే జగ్గారెడ్డి అధిష్టానం దృష్టిలోకి రాకపోవడానికి కారణం స్వయంకృతాపరాధమేనని విశ్లేషకులు అంటున్నారు.
పీసీసీ మార్పు అని వార్తలు వచ్చినప్పుడు మాత్రమే..తానూ రేసులో ఉన్నా అంటూ తెరపైకి వచ్చేవారు జగ్గారెడ్డి. ప్రెస్‌మీట్లు పెట్టి ఆ విషయాన్ని చాటింపు చేసుకొనేవారు. అలాంటి జగ్గారెడ్డినే.. నాయకత్వం మార్పు వార్తలు వచ్చినప్పుడు మాత్రం.. విచిత్రమైన వ్యాఖ్యలు చేసేవారు. పార్టీ నేతలేమో పీసీసీ చీఫ్ మార్పు చేయాల్సిందేనని ముక్తకంఠంతో కోరితే.. జగ్గారెడ్డి మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగించాలంటూ తానొక్కరే డిమాండ్ చేసేవారు. పెద్ద పదవి కావాలనుకునే నేత ఎవరైనా.. ఆ పోస్టు ఎప్పుడు ఖాళీ అవుతుందాని చూడాలే కానీ ఉన్నవారే మరికొన్నాళ్లు సాగాలని కోరుకోరు. ఆ విషయాన్ని జగ్గారెడ్డి ఎప్పుడూ అర్థం చేసుకోలేదు.
ఇక ఓ సారి అయితే తాను కాంగ్రెస్‌లో ఎన్నాళ్లు ఉంటానో తెలియదంటూ .. టీఆర్ఎస్‌లోకి వస్తానంటూ ఇన్‌డైరెక్ట్ హింట్ కూడా ఇచ్చి పార్టీలో పలుచనైపోయారు. పీసీసీ చీఫ్ రేసులో ఉండాలంటే.. కనీసం పార్టీలో నేతలు కొందరైనా తమ పేరు ప్రతిపాదించేలా బలాన్ని, బలగాన్ని సంపాదించుకోవాలి. కానీ జగ్గారెడ్డి ఎప్పుడు అలా చేయలేదు. ఆయన సంగారెడ్డి కాంగ్రెస్‌లో హీరోనే కావచ్చు.. కానీ మొత్తం తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల దృష్టిలో జస్ట్ ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ప్రొజెక్ట్ అయ్యారు. పైగా ఎవరినో పీసీసీ చేయాలని డిమాండ్ చేశారే కానీ.. పార్టీలో తనకు డిమాండ్ పెంచుకోలేకపోయారు. సంగారెడ్డిలో రాహుల్ సభ కోసం కోట్లు ఖర్చు పెట్టానని.. కనీసం పట్టించుకోలేదని వాపోతున్న జగ్గారెడ్డి.. అవే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పార్టీ శ్రేణుల్లో బలం పెంచుకొని ఉంటే ఏమైనా వర్కవుట్ అయ్యి ఉండేదేమో.. ప్చ్!